రక్త, అవయవదానాల గోడ పత్రిక ఆవిష్కరణ
ముద్ర ప్రతినిధి, మెదక్: గత రెండు దశాబ్దాలకు పైగా లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ ద్వారా రక్త ,అవయవ దానాలకు ప్రచారానికి అవగాహన కల్పించడానికి విస్తృత కృషి చేస్తున్న లయన్స్ క్లబ్ రామాయంపేట్ చార్టర్ సభ్యులు, ప్రస్తుత జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి రూపొందించిన రక్త, అవయవదాన గోడపత్రికను లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పట్టి హిల్ ఆవిష్కరించారు. హైదరాబాదులోని కె.ఎల్.ఎం. ప్రసాద్ ఆడిటోరియంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సెమినార్లో రాజశేఖర్ రెడ్డిని అభినందించారు. కాగా రాజశేఖర్ రెడ్డి స్వయంగా 52 సార్లు రక్తదానం చేసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్లు నరసింహన్, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ల ద్వారా అవార్డులు కూడా తీసుకున్నారు. లయన్స్ అంతర్జాతీయ డైరెక్టర్ లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు మాట్లాడుతూ లయన్స్ జిల్లా 320 -డి పక్షాన పలు రక్తదాన శిబిరంలను, రక్త అవయవదాన ప్రాముఖ్యతను, ప్రచారాలను, స్కూల్, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటిలు, ర్యాలీలు, సెమినార్లను నిర్వహించి మెదక్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలోని లయన్స్ క్లబ్బులకు గోడ పత్రికల, డోర్ స్టిక్కర్ ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారని కొనియాడారు.