దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట

దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట
  • ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
  • చర్చి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు


ముద్ర ప్రతినిధి, మెదక్:తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత  ముఖ్యమంత్రి కెసిఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి ఆలయాలకు నిధులు కేటాయించి పునరుద్దరణ కార్యక్రమాలను చేపట్టి  ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి పరుస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.  రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆలయ ఈఓ సారా శ్రీనివాస్,  కలిసిసందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు ఆలయాలను పట్టించుకోక  నిరాదారణకు గురైన వాటిని పునరుద్ధరిస్తున్నారని  అన్నారు. తెలంగాణా తిరుపతిలా యాదాద్రి ఆలయానికి 1200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పరచి ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా గొప్ప ఆలయంగా తీర్చిదిద్దారన్నారు. గతంలో ఏడుపాయలకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో ఉత్సవాలు  నిర్వహిస్తుండేవారని,  ముఖ్యమంత్రి కేసిఆర్ వచ్చాక ఉత్సవాల నిర్వహణకు ప్రతి ఏటా  కోటి రూపాయల నిధులు కేటాయిస్తూ వచ్చారని, అట్టి నిధులతో  ఆలయ పరిసరాలను అభివృద్ధి పరిచామన్నారు. గతంలో ఆలయ వార్షికాదాయం కోటి 60 లక్షల వరకు వస్తుండగా నేడు భక్తుల సంఖ్య పెరిగి 6 కోట్ల వరకు వస్తున్నదన్నారు.  భక్తుల సౌకర్యార్థం పోతంశెట్టిపల్లి నుండి సిసి రోడ్డు వేశామని, దుకాణాల సముదాయం, కాటేజీలు నిర్మిస్తున్నామన్నారు.    భవిష్యత్తులో మరిన్ని విడిది గృహాలను ఏర్పాటు చేయనున్నట్లు, అంతే కాకుండా రైస్ మిల్లుల అసోసియేషన్ అధ్వర్యంలో ఓ కాటేజీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకుంటున్నామని, ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్న పూజారులకు సైతం ధూపదీప నైవేద్యం పథకం ద్వారా వారికి నెలకు 6 వేల రూపాయల  పారితోషకం అందిస్తున్నామని,  ఈ సందర్భంగా  మెదక్ నియోజక వర్గంలోని పలు దేవాదాయాలలో పూజలు చేస్తున్న 49 మంది పూజారులకు ధూపదీప  నైవేద్యం పథకం పత్రాలను అందజేశారు. దీంతో పలువురు పూజారులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వాదాలు అందజేశారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ  ప్రభుత్వం అన్ని మతాలను సమ దృష్టితో చూస్తూ ప్రభుత్వ పరంగా పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు.ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకాన్ని తద్దిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం కరపత్రాన్ని అతిధులు ఆవిష్కరించారు. దేవాదాయ శాఖలో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి, అర్చకులకు మెమెంటోతో సన్మానించారు.అంతకుముందు భరత నాట్యంతో  చిన్నారులు అలరించారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ. సాయి రామ్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా మెదక్ మహా దేవాలయం చర్చిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి ప్రత్యేక ప్రార్తనలు చేశారు. గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దీవించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని మతాలను సమ దృష్టితో చూస్తున్నారన్నారు. కరుణామయుడి దీవెనలు ఉండాలని పద్మ పేర్కొన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అభివృద్ధి అధికారి జంలా నాయక్, బాని, గంగాధర్ తదితరులు ఉన్నారు. 

మసీదులో ప్రార్థనలు

మెదక్ పట్టణం జమ్మికుంటలో గల మసీదులో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు. కౌన్సిలర్ సమ్మి, నొమన్ ఫరూక్ తదితరులు ఉన్నారు.