ప్రభుత్వం హెచ్చరించినా....

ప్రభుత్వం హెచ్చరించినా....

ఏమాత్రం తగ్గని జెపిఎస్ లు
16వ రోజు సమ్మె కొనసాగింపు
విధుల్లో చేరింది 15 మందే
ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు విధుల్లో ఉన్న వారి వివరాలు ఇవ్వాలని.... గ్రామపంచాయతీలలో  కార్యదర్శులు లేనిచోట ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచిస్తూ పరోక్షంగా హెచ్చరికలు చేసినా ఏమాత్రం తగ్గలేదు. 368 మందిలో కేవలం 15 మంది జెపిఎస్ లు మాత్రమే విధుల్లో చేరినట్లు జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తెలిపారు. నేటి వరకు జెపిఎస్, ఒపిఎస్ లు మొత్తం 63 మంది విధుల్లో ఉండగా 303 మంది సమ్మెలోనే ఉన్నారు. మొక్కవోని దీక్షతో శనివారం సైతం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 16వ రోజు సమ్మె కొనసాగించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరినీ రెగ్యులర్ చేయాలని జిల్లా అధ్యక్షుడు కుమార్ డిమాండ్ చేశారు. మా సమస్యల పట్ల స్పందించకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విధుల్లో చేరాలని, మరోవైపు విధుల్లో ఉన్న వారి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడగడం శోచనీయమన్నారు. ఈ సమ్మెలో ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సభ్యులు పద్మ,మాధవి, భానుకుమార్, భవాని, నాగరాజు, జగదీష్ తదితరాలు పాల్గొన్నారు.

సోనికి నివాళులు
ఆత్మహత్య చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరు సోని చిత్రపటానికి సమ్మె శిబిరం వద్ద బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మహుతితోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు కూడా అధైర్యపడి ఆత్మహత్య చేసుకోరాదన్నారు.  ప్రభుత్వం స్పందించే వరకు వెన్నంటి ఉంటామని భరోసానిచ్చారు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ తదితరులు ఉన్నారు.