యాత్రికుల బస్సుపై దాడి... ఉగ్రవాదులకు సహకరించిన నిందితుడి అరెస్టు

యాత్రికుల బస్సుపై దాడి... ఉగ్రవాదులకు సహకరించిన నిందితుడి అరెస్టు

Jammu &Kashmir: ఈనెల 9వ తేదీన జమ్ము కాశ్మీర్ లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడికి సంబంధించి దర్యాప్తులో పోలీసులు పెద్ద పురోగతి సాధించారు. శివ్ ఖోరీ నుంచి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సందర్బంలో బస్సు లోయలో పడి 10 మంది యాత్రికులు మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. శివ్ ఖోరీ నుంచి బయల్దేరిన బస్సు వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న సందర్భంలో రియాసీ జిల్లాలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు సహకరించిన హకీమ్ దిన్ అనే 45 ఏళ్ల వ్యక్తిని జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. రియాసీ జిల్లా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ మోహిత శర్మ మాట్లాడుతూ, హకీమ్ దిన్ పలుమార్లు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టు వెల్లడించారు. అలాగే ఉగ్రవాదులకు గైడ్ గా కూడా వ్యవహరించాడని తెలిపారు. అరెస్టయిన వ్యక్తి ప్రధాన ఉగ్రవాద సహచరుడు, అతను దాడిని అమలు చేయడంలో ఉగ్రవాదులకు సహాయం చేశాడు. తదుపరి విచారణ మరియు కేసు దర్యాప్తు కొనసాగుతోంది ”అని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోహిత శర్మ తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు పోలీసులు ఇప్పటి వరకు గుర్తించారు. శర్మ తెలిపిన వివరాల ప్రకారం, ఉగ్రవాదులు దిన్ ను మూడుసార్లు కలిశారని, ప్రతిసారీ వారికి తన నివాసంలో ఆహారం మరియు ఆశ్రయం కల్పించినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ కేసులో మొత్తం 150 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినపుడు హకీమ్ దిన్ ఇందులో పాల్గొన్నట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు.