జగిత్యాల జిల్లాలో కొనసాగిన బిజెపి హవా ...

జగిత్యాల జిల్లాలో కొనసాగిన బిజెపి హవా ...
  • జీవన్ ఆదరించిన జగిత్యాల నియోజకవర్గ ప్రజలు 
  • కోరుట్లలో బిజెపికి 33 వేల ఆదిక్యం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సుదీర్ఘ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నిజాంబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డికి జగిత్యాల జిల్లా ప్రజలు మొండి చేయి చూపారు. తన సొంత ఇంటి వారు అంటే జిల్లా వారు తనను అక్కున చేర్చుకుంటే బయటపడతానని భావించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిజాంబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి తప్పలేదు. నిజాంబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న జగిత్యాల జిల్లాలో బిజెపి హవా కొనసాగింది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల రెండు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ జిల్లా మొత్తంగా చూసుకున్నట్లయితే బిజెపికి 31,105 ఓట్ల మెజార్టీ వచ్చింది. జిల్లాలో  బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు 1,66,954 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి టీ జీవన్ రెడ్డికి 1,35,849 ఓట్లు , బిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు 36,518 ఓట్లు వచ్చాయి.

ఇక్కడ కాంగ్రెస్ ఫై  బిజెపికి  31105 ఓట్ల ఆదిక్యం లభించింది. నియోజకవర్గాల వారికి చూసినట్లయితే జగిత్యాల నియోజకవర్గ ప్రజలు జీవన్ రెడ్డిని ఆదరించినప్పటికీ ఆశించినమేర  మెజార్టీ కాంగ్రెస్కు రాలేదు. జగిత్యాల నియోజకవర్గంలో బిజెపికి 74,298 ఓట్లు రాగా, బిఆర్ఎస్కు 16,124 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థి టీ.జీవన్ రెడ్డికి 76, 145 ఓట్లు వచ్చాయి. ఇక్కడ చూసినట్లయితే బిజెపి అభ్యర్థి కంటే కాంగ్రెస్ అభివృద్ధి జీవన్ రెడ్డికి 1847 ఓట్ల మెజార్టీ వచ్చింది. రాయికల్ మండలంలో బిజెపికి 295 ఓట్ల మెజారిటీ రాగా బీర్పూర్ లో 1659, సారంగాపూర్ లో 2192, జగిత్యాల అర్బన్ , రూరల్ మండలాల్లో 2033 కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి లీడ్ వచ్చింది. మళ్లీ జగిత్యాల పట్టణ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని  విస్మరించి బిజెపి అభ్యర్థికి పట్టం కడుతూ 2989 ఓట్ల మెజార్టీని బిజెపికి ఇచ్చారు. నియోజకవర్గ ఓవరాల్ గా కాంగ్రెస్ కు వచ్చినప్పటికీ పట్టణంలో పట్టు సాధించలేకపోయారు. కోరుట్ల నియోజకవర్గంలో బిజెపికి 92,656 ఓట్లు రాగా బిఆర్ఎస్కు 20,324, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఫైనాన్స్ 59,704 ఓట్లు రాగా ఇక్కడ బిజెపికి 32,952 ఓట్ల మెజార్టీ వచ్చింది. స్థానికుడైన జీవన్ రెడ్డిని జిల్లా ప్రజలు ఆదరించి అత్యధిక మెజారిటీ కట్టబెడతారని ఆశించినప్పటికీ ఫలితాలు ఆజోష్ కనబడలేదు.