ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్

- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి తీహార్ జైలులో వున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. గత మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. నాటి నుంచి ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులు మధ్యంతర బెయిల్ పై బయటికి వచ్చారు. బెయిల్ గడువు ముగిసిన తర్వాత ఆయన మళ్లీ జైలు అధికారులకు లొంగిపోయారు. తాజాగా ఢిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో తనకు సాధారణ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తర్వాత కోర్టు వేకేషన్ బెంచ్ జడ్జి న్యాయబిందు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. తాము అప్పీల్ కు వెళ్లేంతవరకు 48 గంటల దాకా బెయిల్ ను సస్పెండ్ చేయాలని ఈడీ  చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు కావడంతో ఆప్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే కేసులో అరెస్టయి తీహార్ జైలులోనే ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆమెకు బెయిల్ లభించలేదు. ఇప్పుడు కేజ్రీవాల్ కు బెయిల్ లభించిన నేపథ్యంలో కవితకు త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.