ఈ నెల 31న దేశవ్యాప్తంగా రూ.99కే సినిమా టికెట్‌..!

ఈ నెల 31న దేశవ్యాప్తంగా రూ.99కే సినిమా టికెట్‌..!

ముద్ర,సెంట్రల్ డెస్క్:-సినీప్రియులకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 31న సినిమా లవర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా ప్రేక్షకులు రూ. 99 టికెట్ కే చూడొచ్చని వెల్లడించింది. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ లాంటి చైన్లతోపాటు దేశంలో 4 వేలకుపైగా ఉన్న స్క్రీన్లలో ఇదే టికెట్ ధర ఆ రోజు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లవైపు రప్పించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా ఓవైపు ఎన్నికల హడావిడి, మరోవైపు ఐపీఎల్ ఫీవర్ కారణంగా ఈ సమ్మర్ లో టాలీవుడ్, బాలీవుడ్ సహా ఎక్కడా పెద్ద హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. విడుదలైన చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్ సినిమాలు కూడా పరిమితంగానే విడుదల కావడంతో టికెట్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది.బుక్ మై షో, పేటీఎం, అమెజాన్ పే లాంటి ఆన్ లైన్ వేదికల ద్వారా ఈ నెల 31న సినిమా టికెట్లు బుక్ చేసుకొనే వారు రూ. 99తోపాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నేరుగా థియేటర్ లోని కౌంటర్ లో టికెట్ కొంటే మాత్రం జీఎస్టీ, ఇతర చార్జీలు ఉండవు. అయితే ఐమ్యాక్స్, రిక్లైనర్ సీట్లకు మాత్రం రూ. 99 టికెట్ ధర వర్తించదు.

ఈ శుక్రవారం నాడు తెలుగులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా, పురుషోత్తముడు సహా వివిధ భాషల్లో ఏకంగా 15 సినిమాలు విడుదల కాబోతోన్నాయి.రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ, అనిల్ కపూర్, హర్షవర్ధన్ రాణె, దివ్యా ఖోస్లా- సావి, సముద్రఖని, ఉన్ని ముకుందన్- గరుడన్, స్వకార్యం సంభవబహుళం, గౌతమ్ వాసుదేవ్ మీనన్, శరత్‌కుమార్- హిట్ లిస్ట్, ఇంద్రాన్స్, రమ్య సురేష్ నటించిన- కుండల పురాణం సినిమాలు ఆ రోజున విడుదల అవుతాయి. వాటిని 99 రూపాయలకే చూసేయ్యొచ్చారోజున. ఏపీ, తెలంగాణలో మాత్రం టికెట్ రేట్ 99 రూపాయలకు దొరకవు. సినిమా లవర్స్ డే రోజున ఏపీ, తెలంగాణల్లో మాత్రం మల్టీప్లెక్స్ టికెట్ల రేట్లను 112 రూపాయలుగా నిర్ధారించారు. కొన్ని సెలెక్ట్ చేసిన సినిమాలకు మాత్రమే ఈ టికెట్ ధర వర్తిస్తుంది.