కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి..

ముద్ర,తెలంగాణ:- మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోచారం నివాసానికివెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. కొద్దిసేపు చర్చల అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడుకూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికిగల కారణాలను వివరించారు.

రైతుల సంక్షేమానికి మొదటి నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నో సేవలందించారని రేవంత్ తెలిపారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వంకూడా ప్రాధాన్యత ఇస్తుందని, వ్యవసాయం దడగ కాదు.. పండుగ చేయడమే మా ప్రాధాన్యత అని తెలిపారు. ఈ క్రమంలో రైతుల అభ్యున్నతిని కాంక్షించే పోచారం లాంటి వ్యక్తి తమతో ఉంటే బాగుంటుందని భావించామని, వారి సలహాలు, సూచనలు తీసుకునేందుకు వచ్చామని అన్నారు. పోచారం సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని, రైతుల మేలుకోసం తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో పోచారంనుసైతం భాగస్వామ్యం చేస్తామని రేవంత్ చెప్పారు. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..

రైతు సంక్షేమంకోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైతుల సంక్షేమం దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని కొనియాడారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నానని అన్నారు. రైతుల సంక్షేమాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నా.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరింత కష్టపడి పనిచేస్తానని పోచారం పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు నాయకు బాగా నచ్యాయి. పనిచేసే నాయకత్వాన్ని సమర్ధించేందుకే రేవంత్ కు మద్దతిస్తున్నాను. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.