ఐఆర్ ​5 శాతమా?

ఐఆర్ ​5 శాతమా?
  • రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు భగ్గు
  • కనీసం 20 శాతం ఇవ్వాలని డిమాండ్
  • పెండింగ్​డీఏలు రిలీజ్​చేసినా ఎక్కువ జీతం పెరిగేదని ఆవేదన
     

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)పై ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పెండింగ్‌ డీఏలు విడుదల చేసి.. ఐఆర్‌ ప్రకటిస్తారని ఉద్యోగులంతా భావించారు. ఈ ఐఆర్‌ కూడా కనీసం 20 శాతం ఉంటుందని ఆశపడ్డారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ డీఏల ఊసే ఎత్తకుండా కేవలం ఐదు శాతం ఐఆర్‌ ప్రకటించింది. దీంతో వారు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. కనీసం పెండింగ్‌ డీఏలు విడుదల చేసినా ఇంతకంటే ఎక్కువ వేతనం పెరిగేదని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి 2 022 జూలై 1న (3.64 శాతం) ఒక డీఏ,  ఈ సంవత్సరం జనవరి ఒకటిన (3.64 శాతం) డోవ డీఏ, జూలై  1న (3.64 శాతం) మూడో డీఏ ఉద్యోగులకు రావాల్సి ఉంది.  మూడు కలిపితే 10.92 శాతం మేర డీఏ పెరుగుతుందని వారు భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదు శాతం మాత్రమే ప్రకటించింది.

నోటిఫికేషన్ వచ్చే టైమ్​లో పీఆర్సీ నియామకం..

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా వెలువడొచ్చు. ఇలాంటి తరుణంలో పీఆర్‌సీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్‌సీ చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎన్‌.శివశంకర్‌ను, సభ్యుడిగా బి.రామయ్యను నియమించింది. 6 నెలల్లోగా వేతన సవరణపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి సూచించింది. అయితే పాత పీఆర్‌సీ అమలు గడువు ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది. జులై ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంది. శిశశంకర్ కమిటీ సిఫారసు మేరకు కొత్త పీఆర్సీ ప్రకటించనుంది. అప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో 5 శాతం మధ్యంతర భృతిని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల ఒకటి నుంచి ఐదు శాతం ఐఆర్ ఇవ్వాలని ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. కాగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారికే ఈ ఐఆర్‌ వర్తించనుంది. రాష్ట్ర జ్యుడిషియల్‌, ఆల్‌ ఇండియా సర్వీసుల వారికి, కాంట్రాక్డు ఉద్యోగులు, సొసైటీలు, స్వతంత్ర, ప్రభుత్వ రంగ సంస్థల్లోని వారికి వర్తించదని స్పష్టంచేసింది. ఒక పీఆర్సీ సిఫార్సులు ఆలస్యమయ్యే అవకాశాలున్న ప్రతి సందర్భాల్లోనూ ఐఆర్‌ ప్రకటించడం అనవాయితీగా వస్తున్నది. పీఆర్సీలో ఫిట్‌మెంట్‌ ఖరారు చేసిన తర్వాత, ఈ ఆలస్యమైన కాలానికి ఈ ఐఆర్‌ను మినహాయించి, మిగతా మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తారు. ప్రస్తుతానికి బేసిక్‌ పేపై 5శాతం ఐఆర్‌ను కలిపి వేతనాల్లో జమ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చెల్లిస్తున్న జీతాలు, వివిధ రాష్రాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతాలతో పోల్చి చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఆదాయం పెరుగుదల, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, వాటికయ్యే ఖర్చు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను పరిశీలించాలని కోరింది.

న్యాయపరంగా ఐఆర్​చెల్లించాలి..

ప్రభుత్వం న్యాయపరంగా తమకు ఐఆర్​ను చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. కేవలం 5 శాతం అంటే మరీ తక్కువ అని, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరావలోచన చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యంతర భృతి కనీసం 20 శాతం అయినా ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఐఆర్‌ను 15 నుంచి 20 శాతం మేరకు ఇవ్వాలని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు దాముక కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. పీఆర్సీ వేయడాన్ని స్వాగతిస్తూ ఐఆర్‌ ఉద్యోగులను నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదు శాతం ఐఆర్ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానపరిచారని హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 2023 నుంచి కనీసం 15 శాతం అయినా ఐఆర్ ఇచ్చి ఉద్యోగుల మెప్పు పొందాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో కచ్చితంగా ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురవుతుందని అన్నారు.

  • ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా?
  • 20 శాతం ఐఆర్​ప్రకటించాలి
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం 5 శాతం ఐఆర్ ప్రకటించడం మరీ దారుణమని, కనీసం 20 శాతం ప్రకటించాలని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకునే సీఎం కేసీఆర్..​ఏమిటీ దారుణమని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న మూడు డీఏల్లో కనీ రెండు డీఏలు వెంటనే మంజూరు చేయాలని, ఏడాదిగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలని మంగళవారం వారు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

ఇలాంటి ఐఆర్​ను ఎప్పుడూ చూడలేదు..

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అలాగే ఐఆర్ పై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఇలాంటి ఐఆర్ ను ఉద్యోగులు ఎన్నడు చూడలేదన్నారు. ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసే పీఆర్సీలో ఈ శాతం దారుణంగా ఉందన్నారు. ఐదేళ్లలో పెరిగిన ధరలకు ప్రకటించిన ఐఆర్ కు ఏమాత్రం సరి లేదన్నారు. ధనిక రాష్ట్రం, దేశంలోనే అత్యధిక వేతనాలు, ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామనే సీఎం ఈ తరహా ప్రకటన చేయడం నిరాశకు గురి చేసిందని, సీఎం ప్రకటనతో రాష్ట్రంలోని  సుమారు 2.75 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, 2 లక్షల మంది పెన్షనర్లు ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. ఐఆర్ ను వెంటనే సవరించి 20 శాతాన్ని ప్రకటించాలన్నారు.