మోడీకి ఆస్కార్ ​ఇవ్వొచ్చు!

మోడీకి ఆస్కార్ ​ఇవ్వొచ్చు!
  • ఆయన సినిమాలకు స్టోరీలు రాస్తే మంచిది
  • సీఎం కేసీఆర్ ఫైటర్.. ఛీటర్‌తో కలిసి పనిచేయరు 
  • మేము ఢిల్లీకి గులాములం కాదు.. గుజరాతీ బానిసలం అంతకన్నా కాదు
  • నేను సీఎం అవడానికి మోడీ అనుమతి ఎందుకు?
  • ఆయన భయపెడితే ఇక్కడెవరూ భయపడరు
  • ప్రధానిపై బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​తీవ్ర ఆగ్రహం
  • 70 ఏళ్ల వయసులో పదవికి తగ్గట్లు వ్యవహరించాలని చురక

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రధానమంత్రి మోడీ సినిమాలకు స్టోరీలు రాస్తే ఆస్కార్ కూడా వస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ ఫైటర్. ఆయన ఛీటర్‌తో కలిసి పనిచేయరని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఢిల్లీకి గులాములం కాదని, గుజరాతీ బానిసలం అంతకన్నా కాదని ధ్వజమెత్తారు. మంగళవారం ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తాను సీఎం అవ్వడానికి ప్రధాని అనుమతి అవసరం లేదని, మోడీ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి సీఎంలను అవినీతి ముఖ్యమంత్రులుగానే వ్యాఖ్యానిస్తారని ఫైర్ అయ్యారు. 70 ఏళ్ల వయసులో మోడీ తన పదవికి తగినట్లుగా వ్యవహరించాలని చురకలంటించారు. ప్రస్తుతం  ఎన్డీయేను కీలక పార్టీలన్నీ వదిలేశాయని, వాళ్లకు మిగిలింది ఈడీ, సీబీఐలేనని దుయ్యబట్టారు. మీరు భయపెడితే ఇక్కడ ఎవరూ భయపడరన్నారు.

అపుడు రాచరికం గుర్తుకురాలేదా?

అకాళీదళ్, పీడీపీ, టీడీపీ, శివసేన, జేడీఎస్‌లను తమ అక్కున చేర్చుకున్నప్పుడు మోడీకీ రాచరికం గుర్తు రాలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన గొంతు చించుకున్నా.. పచ్చి అబద్ధాలు చెప్పినా.. తెలంగాణలో బీజీపి కనీసం 2 స్థానాల్లో కూడా గెలువదన్నారు. ఈసారి 110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్ రాదని స్పష్టం చేశారు. గత 9 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ రాజు, యువరాజు అంటూ ఏదేదో మాట్లాడారని, ఆయనతో ఉంటే మంచి.. లేదంటే రాచరికం అని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి జూమ్లాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అబద్ధాలకు ప్రచారకర్త అని కేటీఆర్ అన్నారు. 

జై షాకు పదవి ఎందుకిచ్చారు..?

జై షా ఎవరు..? ఆయనకు బీసీసీఐ జనరల్ సెక్రటరీ పదవి ఎందుకిచ్చారని కేటీఆర్ నిలదీశారు. హిమంతు బిశ్వ శర్మ, జ్యోతిరాధిత్య సింధియాపై ఉన్న కేసులు, వాళ్లు బీజేపీలో చేరాక ఏమయ్యాయని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పే మోడీతో మేమెందుకు కలవాలని ప్రశ్నించారు. ఇంటింటికి నీళ్లు ఇస్తాం, ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇస్తాం, రూ.15 లక్షలు బ్యాంకు ఖాతాలో వేస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చుతానని మోడీ చెప్పినవన్నీ అబద్ధాలేనని కేటీఆర్ అన్నారు. ప్రధానమంత్రి స్థాయిని తగ్గించేలా నరేంద్ర మోడీ మాట్లాడారన్నారు. రాజకీయాల కోసం ఇంత నీచనికి దిగజారిన వ్యక్తి.. మాటలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య జరిగిన ఒక అధికారిక సమావేశాలను నీఛమైన రాజకీయాలకు ఆయన వాడుతున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి అబద్ధాల తర్వాత ప్రతి అధికారిక సమావేశానికి ఒక కెమెరాని పట్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తున్నదన్నారు. తనకు అలవాటైన అబద్ధాలకు అనుగుణంగా మోడీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విద్య అర్హతల విషయంలోనే అబద్ధం చెప్పిన ప్రధానమంత్రి మాటలను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.

ఏ రాష్ట్రానికి వెళితే..

ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో అబద్ధాలు ఆడడం ప్రధానమంత్రికి అలవాటైందని కేటీఆర్ విమర్శించారు. బెంగాల్ వెళ్తే మమతా బెనర్జీపై, ఒరిస్సా వెళ్తే నవీన్ పట్నాయక్ పై, మేఘాలయ వెళ్తే సంగ్మాపై అబద్ధాలు చెప్పారన్నారు. ఆ తర్వాత వారితోనే పొత్తులు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. గతంలో మోడీ ప్రకాశ్ బాదల్- సుబ్బి సింగ్ బాదల్ వంటి వాళ్లతో పొత్తులు పెట్టుకోలేదా? కశ్మీర్లలో ముఫ్తీ మహమ్మద్ సహిద్ కుమార్తెతో పొత్తు పెట్టుకోవచ్చు. చంద్రబాబు నాయుడు, లోకేశ్​తో కలిసి పని చేయవచ్చు.. ఎన్డీఏలో ఉండవచ్చునని అన్నారు. అలాగే బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్​థాక్రే తో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకున్నారు కదా..? అప్పుడు వారసత్వ రాజకీయాలు గుర్తుకు రాలేదా అని కేటీఆర్​మోడీని ప్రశ్నించారు. బీజేపీ అంటే ఒక వాట్సాప్ యూనివర్సిటీలా మారిందన్నారు.  ఎన్డీఏ ఒక మునిగిపోతున్న నావ అని, అందులో చేరాల్సిన అవసరం తమకు లేదన్నారు. గుండెలు చించుకొని అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజం అయిపోవన్నారు. తెలంగాణ ప్రజలు మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని ఎన్నుకోవడానినికి రెడీగా ఉన్నారన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా బీజేపీని రాష్ట్ర ప్రజలు పట్టించుకోరన్నారు.

పొలిటికల్​రచ్చ.. సర్వత్రా చర్చ ! 
టీ రాజకీయాలను హీటెక్కించిన మోడీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్​సభలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన ప్రధాని మోడీ.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించారు. గ్రేటర్​ హైదరాబాద్​ఎన్నికల తర్వాత తన వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్​బీఆర్ఎస్​ ను ఎన్డీయేలో కలపాలంటూ ప్రతిపాదించారని, కేటీఆర్​ను తన రాజకీయ వారసుడిగా ఆశీర్వదించాలని కోరితే.. తాను నిరాకరించానని ప్రధాని చెప్పారు. దీంతో గ్రేటర్​ ఎన్నికలు మూడేళ్ల క్రితమే జరగడం, అప్పట్లో తనతో కలిసిన కేసీఆర్​ప్రతిపాదనను మోడీ ఇన్నాళ్ల తర్వాత ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేసీఆర్.. మోడీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కేసీఆర్​విమర్శలపై స్పందించని మోడీ.. తాజాగా కేసీఆర్​ప్రతిపాదించారంటూ బహిరంగ సభలో ప్రస్తావించడం రాజకీయవర్గాల్లో హాట్​టాపిక్​గా మారింది. 

కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు..

మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో గెలుపు అవకాశాలున్న కాంగ్రెస్​పార్టీపై చేసిన ఆరోపణలు కూడా చర్చకు దారితీశాయి. అధిక జనాభా.. అంతే హక్కు అనే ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. తాను అధికారంలో ఉన్న తమిళనాడులో హిందూ దేవాలయాలపై అక్కడి ప్రభుత్వం దోపిడీ, ఆక్రమణలను ప్రశ్నించారు. మైనార్టీల ప్రార్థనా మందిరాల జోలికి వెళ్లడం లేదంటూ ధ్వజమెత్తారు. దక్షిణ భారత దేశంలోనూ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పిలుపు మేరకు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించారన్నారు. త్వరలోనే పార్లమెంట్​నియోజకవర్గాల పునర్విభజన జరగనుందని.. ఇందులో దక్షిణ భారతంలోని రాష్ట్రాలకు చెందిన మైనార్టీలకు అన్యాయం జరిగే అవకాశాలున్నాయన్నారు.

మోడీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం 
ముసుగు తొలిగి నిజమేంటో తెలిసింది
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజం

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ – బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాని మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరూ చీకటి మిత్రులన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుంచి చెబుతున్నదే నిజం అని మోడీ మాటల ద్వారా స్పష్టంగా తేలిందని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది అక్షరాల నిజమని, మోడీ ఆశీసులతో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నది కూడా నిజమన్నారు. ఇప్పటికీ మోడీ – కేసీఆర్ చీకటి మిత్రులే అన్నది పచ్చి నిజమని రేవంత్ వ్యాఖ్యానించారు. గడచిన 9 ఏళ్లలో మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కేసీఆర్ మద్ధతు ఉన్నదన్నది పార్లమెంట్ రికార్డులే చెబుతాయని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చీకట్లో మోడీతో ఏమేం లాలూచీలు పడ్డారో మోడీయే చెప్పిన తర్వాత ఇక వారిద్దరి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వారి రహస్య ఒప్పందంపై సందేహించాల్సిన అవసరం అంతకంటే లేదని రేవంత్ అన్నారు.