కరీంనగర్ డెయిరీ కి 90.70 కోట్ల ప్రాజెక్ట్ 

కరీంనగర్ డెయిరీ కి 90.70 కోట్ల ప్రాజెక్ట్ 

 ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ ప్రాజెక్టుకు కరీంనగర్ డైరీ ఎంపికైంది. సోమవారం కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కరీంనగర్ కార్యాలయంలో నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కరీంనగర్ డైరీ కి జైకా ప్రాజెక్టు దక్కడం అభినందనీయం అన్నారు. దీనిలో భాగంగా 90.70 కోట్ల రుణం మంజూరు కానుంది. ఇందులో 71.52 కోట్లు రుణం కాగా 12.46 కోట్ల రూపాయలు గ్రాంట్, మరో 6.72 కోట్లు కరీంనగర్ డైరీ సహకారంతో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని వెల్లడించారు.

దీనికి 1.5 శాతం మాత్రమే  వడ్డీ చెల్లించనుండగా దీనిని 10 సంవత్సరాల వ్యవధిలో తిరిగి రుణం చెల్లించాలి. పాల సేకరణ సంస్థలు, భవనాలు, పాల పరీక్ష యంత్రాలు, పాల క్యాన్లు, పాల సేకరణ యూనిట్లు, ఫర్నిచర్ తదితర మౌలిక సదుపాయాల కోసం ఈ డబ్బులను వినియోగించనున్నారు. వినోద్ కుమార్ చేతుల మీదుగా 16 నూతన ఉత్పత్తులను ప్రారంభించారు. ఇందులో కప్స్, కోన్స్, స్టిక్స్, బార్స్, నోవాల్టీస్, కుల్ఫీ తదితర ఉత్పత్తులు ఉన్నాయి. మానేరు పేరుతో పెరుగు తదితర ఉత్పత్తులను ప్రారంభించారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండలో 100 కోట్లతో రూపుదిద్దుకున్న ఐదు లక్షల లీటర్ల కెపాసిటీ డెయిరీ త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. డైరీ జనరల్ మేనేజర్ శంకర్ రెడ్డి తో పాటు  పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.