ఎమ్మెల్యేలకు నిరసనల సెగ

ఎమ్మెల్యేలకు నిరసనల సెగ
  • దళిత బంధు, గృహ లక్ష్మి డబుల్​ ఇండ్ల కోసం నిలదీత
  • అనర్హులకు ఇస్తున్నారంటూ ఆరోపణలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీ శాసనసభ్యులకు ప్రజలు  నిరసనలతో స్వాగతం పలుకుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వారిని నిలదీస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపైనే వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలను వ్యక్తం చేస్తు్న్నారు. అనర్హులకు, పైరవీకారులకు, డబ్బులు ఇచ్చిన వారికే దళిత బంధు, గృహలక్ష్మీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇచ్చారంటూ మండిపడుతున్నారు. సంక్షేమ పథకాలలో  ఎంపిక చేయడానికి తాము గుర్తుకు రాలేదు కానీ....ఇప్పుడు ఓట్ల కోసం గుర్తుకు వస్తున్నామా? అంటూ నడిరోడ్డుపైనే వారిని కడిగిపారేస్తున్నారు.  ఊహించని ఈ పరిణామాలపై బీఆర్ఎస్ శాసనసభ్యులు ఉక్కిరి, బిక్కిరికి గురవుతున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని గట్టి ధీమాతో ఉన్న గులాబీ పార్టీ అభ్యర్ధులకు ప్రస్తుతం ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహవేశాలను చూసి హై.... టెన్షన్ కు లోనవుతున్నారు.
ఈ ఆగ్రహవేశాలు  కేవలం ఒకటి, రెండు నియోజకవర్గాల్లోనే కాకుండా పలు నియోజకవర్గాల్లో క్రమంగా చాపకింద నీరులా పాకుతున్నాయి. ఇక పలు మంత్రుల నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై ఇటీవల  దాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రధానంగా జగిత్యాల జిల్లాలో మూతపడిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపకపోవడంతో ఆగ్రహించిన స్థానిక ప్రజలు మంత్రి కేటిఆర్ కాన్యాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక నగరంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లి న మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుడు ముఠాగోపాల్, ఎంఎల్ సి బుగ్గారపు దయానంద్ ను ఆర్యవైశ్య ప్రతినిధులు అడ్డుకున్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులకు ఏం చేయని మీ ప్రభుత్వానికి ఎందుకు సహకరించాలని వారు నిలదీశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పలేక వారు వెనుతిరగాల్సి వచ్చింది. ఇక  పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ శాసనసభ్యులకు ప్రజల నుంచి చీత్కారాలు ఎదురవుతున్నాయి. 
నల్గొండ, మహబూబాబాద్, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, వర్ధన్నపేట, నాగర్ కర్నూల్, హుజూర్ నగర్, ములుగు, పెద్దపల్లి, జడ్చర్ల, నాగార్జునసాగర్ తదితర నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్ధులకు ప్రజలు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.  నల్గొండ  మండలం కంచనపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గ్రామంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గృహలక్ష్మి, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు అవకాశం కల్పించారని కంచనపల్లి గ్రామస్తులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో  ఆ గ్రామంలో అడుగుపెట్టకుండానే ఆయన తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అలాగే మహబుబా బాద్ లో  కూడా సిట్టింగ్ శాసనసభ్యుడు శంకర్ నాయక్ కు  నియోజకవర్గం ప్రజలు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సంక్షేమ పథకాలను ఎవరికి ఇచ్చారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ పరిస్థితి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కొనసాగుతుండడంతో సిట్టింగ్ శాసనసభ్యులు ప్రజల్లోకి వెళ్లాంటే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక  భూ సమస్యలపై ఘన్ పూర్, పరకాల, వర్ధన్న పేట్ నియోజకవర్గాల అభ్యర్ధులపై ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.
నాగార్జునసాగర్ లో సిట్టింగ్ శాసనసభ్యుడు ఎమ్మెల్యే నోముల భగత్ సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కొంటున్నారు. ఈసారి కూడా అతనికే టికెట్ ఇవ్వడంతో పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నది.  తండ్రి మరణంతో జరిగిన ఉపఎన్నికలో గెలిచిన భగత్  ఆ తర్వాత పార్టీ కార్యకర్తలను, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు.తన సామాజిక వర్గం వరకే పెద్దపీట వేస్తున్నారని కేడర్ నుండి వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేయకపోవడం, నెల్లికల్ల లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం ఆపడం, గ్రామాలలో మౌలిక వసతుల కల్పన చేయకపోవడం ఇవన్నీ భగత్ ను నియోజకవర్గ ప్రజలకు దూరం చేస్తున్నాయని తెలుస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎస్టీ లంబాడీల ఓట్లు అత్యధికంగా ఉండగా.... ప్రస్తుతం వారంతా నోములపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. నోముల  స్థానికుడు కాదని, ఆయన టికెట్ క్యాన్సిల్ చేయాలని అంటున్నారు.  అయితే ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు షరా మాములేనని....దీనివల్ల రెండు, మూడు రోజులు  ప్రజలు అసంతృప్తితో ఉన్నప్పటికీ ఓట్ల నాటికి ప్రజలంతా కేసీఆర్ కే మద్దతు తెలుపుతారన్న ధీమాతో సిట్టింగ్ శాసనసభ్యులు ఉన్నారు.