నలభైల్లోనే మెనోపాజా?

నలభైల్లోనే మెనోపాజా?
Menopause in the forties

ఎన్నో ఏళ్లపాటు పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే టైమ్ మెనోపాజ్. మహిళల జీవక్రియలో మెనోపాజ్ కీలకఘట్టం. ఇది స్త్రీలలో పునరుత్పత్తి శక్తి ఆగిపోతోందని తెలిపే సంకేతం. ఈ సమయంలో హార్మోన్లలో వచ్చే తేడాల కారణంగా భావోద్వేగాల్లో మార్పులు, శారీరక ఇబ్బందులూ వస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం వల్ల కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. మెనోపాజ్‌కు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశలో తలెత్తే సమస్యలను అధిగమించవచ్చు. సాధారణంగా 50 ఏండ్లు దాటిన తరువాత మెనోపాజ్‌ దశకు చేరుకుంటారు. కానీ జీవనశైలి మార్పుల కారణంగా నలభైల్లోనే మెనోపాజ్‌ లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళనకరం. దీంతో మహిళలు నడి వయసులోకి ప్రవేశించక ముందే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

అవేంటో చూద్దాం.. 
సాధారణంగా ఆడశిశువు పుట్టుకతోనే 12 లక్షల నుంచి 20లక్షల అండాలతో జన్మిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఆడపిల్లకు రుతుక్రమం మొదలయ్యే సమయానికి సుమారు 400 నుంచి 500 అండాలు మాత్రమే మిగులుతాయి. రుతుక్రమం సమయంలో ప్రతీ నెల కొన్ని అండాలు విడుదలవుతూ వాటి నిల్వ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా అండాశయంలోని అండాలు పూర్తిగా అయిపోయే దశనే మెనోపాజ్‌గా పేర్కొంటారు. మెనోపాజ్‌ దశకు చేరుకునేసరికి అండాల విడుదలతో పాటు హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది. మెనోపాజ్‌ అనేది స్త్రీలో పునరుత్పత్తి నిలిచిపోవడానికి సంకేతం.

మెనోపాజ్‌ ఒక్కసారిగా తలెత్తే పరిస్థితి కాదు. మెనోపాజ్‌కు 5 నుంచి 7 సంవత్సరాల ముందే శరీరంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. వాటిలో ముఖ్యంగా హార్మోన్ల స్థాయి క్రమంగా తగ్గుతుంది. పీయూష గ్రంథి నుంచి గొనడోట్రోపిన్‌ వంటి హార్మోన్లు అధికంగా విడుదల అవుతాయి. ఫలితంగా శారీరక మార్పులు జరిగి మెనోపాజ్‌ దశకు చేరుకుంటారు. ఈ ప్రక్రియలన్నీ మహిళల్లో 47 నుంచి 53 మధ్య వయసులో సంభవిస్తాయి. అంటే మెనోపాజ్‌ రావడానికి సగటు వయసు 51సంవత్సరాలు. కొంతమందిలో కొంచెం ఆలస్యంగా కూడా రావచ్చు. కానీ ప్రస్తుతం చాలామంది మహిళలు 45లోపే మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్నారు. ఇంకొంతమందిలో అయితే 40లోపే ఈ మార్పు కనిపిస్తోంది..  దీనినే ‘ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌(ముందస్తు మెనోపాజ్‌)’ అంటారు.

 కారణాలు
మెనోపాజ్​ ముందస్తుగా రావడానికి వంశపారంపర్యంగా కానీ, జన్యులోపంగా గానీ, జంక్​ఫుడ్​ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ, బరువు పెరగడం, తగినంత వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గానీ,  ధూమపానం, మాదక ద్రవ్యాలను తీసుకునేవారిలో గానీ, పిల్లలు పుట్టడానికి ఫెర్టిలిటీ చికిత్స తీసుకునేవారిలో మెనోపాజ్ చాలా త్వరగా వస్తుంది. అంటే 45 సంవత్సరాల లోపుగానే ముందస్తు మెనోపాజ్​ వస్తుంది. 

లక్షణాలు
మెనోపాజ్​కు గురైన మహిళల్లో  క్యాల్షియం తగ్గిపోవడం,  నెలసరి క్రమం తప్పడం,  రెండు మూడు నెలలకు ఒకసారి నెలసరి రావడం, నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం లేదా అతి తక్కువ రక్తస్రావం అవ్వడం, మానసిక ఒత్తిడి పెరగడం, అసహనం, కోపం, చిరాకు వంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో కీళ్లనొప్పులు, నీరసం, అలసట, చెమటలు పట్టడం,  తల, నుదురు, మెడ దగ్గర చర్మం ఎర్రగా మారడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. 


మెనోపాజ్​ వచ్చిన మహిళల్లో క్యాల్షియం తగ్గిపోవడం, బీపీ, కొలెస్ట్రాల్​ పెరగడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఉన్నట్టుండి శరీరం వేడిగా మారడం, చెమటలు పట్టడం, ఎముకలు బలహీనమై ఆస్టియోపోరోసిస్​ ఏర్పడటం, ఫ్రాక్చర్​ టెండెన్సీ అధికంగా ఉండటం, యోని, మూత్రనాళం, మూత్ర కోశాల్లో ఈస్ట్రోజన్​ హార్మోన్​ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి.  కలయిక సమయంలో నొప్పి, మంట ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.     

ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన స్ర్తీలు తప్పనిసరిగా మామోగ్రామ్‌, పాప్‌స్మియర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. తరచుగా లిపిడ్‌ ప్రొఫైల్‌, బ్లడ్‌ షుగర్‌, బీపీ పరీక్షలు చేయిస్తూ ఉండాలి. మెనోపాజ్‌ వచ్చిన తరువాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎముకల సాంద్రత పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆహార నియమాల విషయానికి వస్తే మెనోపాజ్‌ దశలో సోయాబీన్స్‌ ఉత్పత్తులు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉండే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. టమాట, గుమ్మడి, క్యారెట్‌, బొప్పాయిలో క్యాన్సర్‌ నిరోధక మూలకాలు ఉంటాయి. వీటిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవాలి.  ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే అవిసెలు, చేపలు తరచూ తీసుకోవాలి. ఫైబర్‌, ప్రొటీన్స్‌ కలిగిన పదార్థాలను అధికంగా తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు వీలైనంత మేర తగ్గించాలి. ప్రతిరోజు కనీసం అరగంట వ్యాయామం చేయాలి. యోగా, మెడిటేషన్‌ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మెనోపాజ్‌ తరువాత ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు లక్షణాల తీవ్రత ఆధారంగా చికిత్సను తీసుకోవచ్చు.  దీనితోపాటు క్యాల్షియం, హార్మోనల్‌ సప్లిమెంట్లు, విటమిన్‌-డి, మల్టీవిటమిన్స్‌ ఇస్తారు. అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్‌ కూడా తీసుకోవాలి.
– డాక్టర్​ యశోద
సీనియర్​ గైనకాలజిస్ట్​