కిషన్ రెడ్డి కృషితో సర్కారు బడులకు మహర్ధశ...

కిషన్ రెడ్డి కృషితో సర్కారు బడులకు మహర్ధశ...

ముద్ర,తెలంగాణ:- గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థినులు అనేక మంది మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. పాఠశాలల్లో బంగారు తల్లులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే సంకల్పంతో కిషన్ రెడ్డి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ప్రభుత్వ బడులను అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. పిల్లలను సర్కారు బడిబాట పట్టించారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాల్లేవు. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో, మరికొన్నిచోట్ల నిధులు లేమితో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలల భవనాలన్నీ సరికొత్తగా రూపుదిద్దుకునేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. అంబర్ పేట్, లాలాపేట్, మాసబ్ ట్యాంకు, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, నారాయణగూడ, జామా ఉస్మానియా వంటి ప్రాంతాల్లో బాలబాలికలకు తాగునీటి సౌకర్యం, డైనింగ్ హాల్స్ నిర్మించడంతో పాటు అవసరమైన చోట అదనపు తరగతి గదులు, సైన్స్‌ ల్యాబ్స్‌, నోట్ బుక్స్, గ్రంథాలయాలను ఏర్పాటు చేసి గుణాత్మక విద్య వైపు అడుగులు వేసేలా కృషి చేశారు. పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు, స్కూళ్ల నిర్వహణ, పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన సదుపాయాలు కల్పించారు. 

ప్రభుత్వ పాఠశాలలో ఏబీవీ ఫౌండేషన్, ఎన్టీపీసీ సహకారంతో ఏర్పాటు చేసిన హై ప్రెషర్ టాయిలెట్ క్లీనింగ్ మిషన్ లను పాఠశాలకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో చిన్నారులు, టీచర్ల సమస్యను పరిష్కరించేందుకు తన వంతు సహాయంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు క్లీనింగ్ మిషన్లను పంపిణీ చేశారు.

మొత్తంగా 7 ప్రభుత్వ పాఠశాలల్లో 7 సైన్స్ ల్యాబులు..  23 స్కూల్స్ లో 1100 బెంచీలు ఏర్పాటు చేశారు. స్వచ్ఛత, పరిశుభ్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వివిధ ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లకు 1200 కి పైగా టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు అందజేశారు. 23 స్కూళ్లలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లతో పాటు 55 గవర్నమెంట్ స్కూళ్లలో 55 డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేశారు. అంతాకాదు.. 14 ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పించారు. కిషన్ రెడ్డి కృషితో ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. దీంతో తమ పిల్లలను గవర్నరమెంట్ స్కూళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తి పెరిగింది.