కండిషన్స్ అప్లై... కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి

కండిషన్స్ అప్లై...  కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి

రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయితే షరతులు వర్తిస్తాయని తెలిపింది. జూన్‌ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతు విధించింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించకూడదని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులు భేటీలో పాల్గొనకూడదని తేల్చిచెప్పింది. శనివారం జరగాల్సిన రాష్ట్ర కేబినెట్‌ భేటీ వాయిదాపడిన విషయం తెలిసిందే. శనివారం నిర్వహించాలనుకున్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ అనుమతి రానందున క్యాబినెట్‌ భేటీని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. శనివారం సాయంత్రం 7 గంటల వరకు ఈసీ అనుమతి కోసం వేచి చూశామని, అనుమతి రాకపోవడంతో సమావేశం కాలేకపోయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈసీ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని, సోమవారం నాటికి అనుమతి రాకపోతే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

ఒకవేళ అనుమతి వచ్చి ఉంటే, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వానకాలం పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని ఎజెండా సిద్ధం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతి లేకపోవడంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణతోపాటు రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తి కావడంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలను క్యాబినెట్‌ భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. క్యాబినేట్‌ భేటీ వాయిదా పడటంతో ఇవేవీ చర్చించలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా ఈసీ నుంచి కేబినెట్ భేటీకి అనుమతి వచ్చింది. అయితే, రైతు రుణమాఫీ, విభజన అంశాలపై చర్చించవద్దని ఈసీ స్పష్టం చేసింది.