‘పొంగులేటీ’ ఇదేంటీ?

‘పొంగులేటీ’ ఇదేంటీ?
  • ఉమ్మడి ఖమ్మంలో ఆరుస్థానాలకు పట్టు
  • మేఘారెడ్డికి వనపర్తి టిక్కెట్టు కోసం యత్నం 
  • పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఠాక్రేతో భేటీ
  • కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం
  • టీపీసీసీ చీఫ్​ రేవంత్ అండపై సీనియర్ల గుర్రు?

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఊహించినట్టే జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరికకు ముందు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెట్టిన షరతులపై ప్రచారం మళ్లీ మొదలైంది. కాంగ్రెస్ లో చేరే ముందు నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డితో సంప్రదింపులు జరిపిన పొంగులేటి, ఉమ్మడి ఖమ్మంలో తన అనుచరుల కోసం ఎమ్మెల్యే టిక్కెట్ల డిమాండ్​పెట్టినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే సైతం పొంగులేటి ఎలాంటి టిక్కెట్లు ఆశించడం లేదని, ఏ డిమాండ్​లేకుండానే కాంగ్రెస్ లో చేరుతున్నారని స్పష్టం చేసిన విషయమూ తెలిసిందే. తాజాగా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏఐసీసీ స్ధాయిలో ఏడు టిక్కెట్ల కోసం పైరవీలు ముమ్మరం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని జనరల్ స్థానాలైన కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు, రిజర్వ్​స్థానాలైన అశ్వారావుపేట, సత్తుపల్లి, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేఘారెడ్డికి వనపర్తి టిక్కెట్టు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఢిల్లీలో ఠాక్రేతో పొంగులేటీకి  మంతనాలు జరిపారనీ, ఠాక్రేతో సైతం సదరు అభ్యర్థులకు సర్వే అనుకూలంగా ఉంటే టిక్కెట్లు ఇచ్చేందుకు సముఖత చూపారని సమాచారం. 

రెండు నెలల తరువాత

పార్టీలో చేరిన రెండు మాసాల వరకు తెరపైకి రాని డిమాండ్​ఒకేసారి తెరపైకి రావడంతో సీనియర్లు సైతం ఖంగు తిన్నారు. ఇప్పటికే టిక్కెట్ల రేసులో ఉన్న సీనియర్లు, జూనియర్లు తమ తమ స్థాయిలో విశ్వప్రయత్నాలు చేస్తుంటే, పొంగులేటి ఏకంగా హస్తిన కేంద్రంగా లాబీయింగ్​ చేయడంతో రాష్ట్ర నేతలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు, ఆశావహులు మండిపడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్​నాయకురాలు రేణుకా చౌదరితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సైతం అప్పట్లో పొంగులేటి చేరికను వ్యతిరేకించినట్టు ప్రచారం జరిగింది. రేణుకా చౌదరి ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఆయన చేరికను అడ్డుకోగా, అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కి తగ్గారని సమాచారం. తాజాగా హస్తిన కేంద్రంగా పొంగులేటి చేస్తున్న రాజకీయాలపై టీ కాంగ్రెస్​ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ లో ఉంటూ పార్టీని బలోపేతం చేసిన తమను కాదని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్​ రావ్​ ఠాక్రే పొంగులేటికి ప్రాధాన్యం కల్పించడాన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. 

పొంగులేటి వ్యూహమేంటి? 

వచ్చే ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క సీటులో బీఆర్ఎస్ ను గెలవనీయబోననీ, ఏ ఒక్క ఎమ్మెల్యేనూ అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి ఆ జిల్లా పరిధిలోని పది స్థానాలలో కాంగ్రెస్​ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నట్లు ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్​ కండువా కప్పుకున్న అనతికాలంలోనే పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా వారిని కాదని, పొంగులేటికి ప్రచార కమిటీ కో చైర్మన్​బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 17న తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్​ విజయభేరీ సభకు పబ్లిసిటీ, బ్రాండింగ్ కమిటీ చైర్మన్​బాధ్యతలు అప్పగించడంతో సీనియర్లు సైతం ఆశ్చర్యపోయారు. వచ్చే ఎన్నికలలో పొంగులేటే కీలకంగా వ్యవహరిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు పాలేరు టిక్కెట్టు వచ్చే అవకాశాలున్నాయని టీపీసీసీ వర్గాలే చెబుతున్నాయి. ఇటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఓబీసీ చైర్మన్​ ఎడవెల్లి కృష్ణ, టీపీసీసీ సభ్యుడు నాగా సీతారాములు కొత్తగూడెం నుండి టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక అధిష్టానం ఏం చేస్తుందో వేచి చూడాలి.