ఫీడ్ బ్యాక్ ఏ సెగ్మెంటులో ఏం జరుగుతోంది?

ఫీడ్ బ్యాక్ ఏ సెగ్మెంటులో ఏం జరుగుతోంది?
  • గెలుపు అవకాశాలపై ప్రధాన పార్టీల ఆరా
  • రంగంలోకి దిగిన ప్రైవేట్ సర్వే ఏజెన్సీలు
  • ఎన్నికలలో చిన్న పార్టీల ప్రభావమెంత? 
  • బీసీల బలమెంత? మైనార్టీలు ఎటువైపు?
  • ప్రకటించిన వరాలు, డిక్లరేషన్లపై జనం ఏమంటున్నారు? 
  • అభ్యర్థుల బలమేంటి? పార్టీల పరిస్థితులు ఏమిటి?
  • గెలవాలంటే ఇంకా ఏమేం చేయాలి?
  • గ్రామీణ ప్రాంతాల నుంచి వివరాల సేకరణ

ముద్ర, తెలంగాణ బ్యూరో :తెలంగాణలో పొలిటికల్ సీన్ మారింది. కొంత కాలంగా దేశం, రాష్ట్ర స్థాయిలో వేడెక్కిన రాజకీయాలు ఇప్పుడు గ్రామ స్థాయిలోనూ హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ప్రస్తుత సంక్షేమ పథకాలకు తోడు కొత్త స్కీముల ప్రకటనతో ఓటర్లను ఆకర్షించే చేపనిలో పడింది. కాంగ్రెస్​సైతం డిక్లరేషన్ల ప్రకటనలకు తెరలేపిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ క్షేత్రస్థాయిలో పార్టీ, అభ్యర్థుల బలాబలాలు తెలుసుకునే పనిలో పడిపోయిన ప్రధాన పార్టీలు తాజాగా సర్వే కోసం ప్రైవేట్​ ఏజెన్సీలను రంగంలో దించడం హాట్ టాపిక్ గా మారింది. క్షేత్రస్థాయి సర్వేను స్థానిక నేతల కనుసన్నలలోనే నిర్వహిస్తున్న పార్టీలు, ఒక్కో సర్వే బృందంలో మూడు నుంచి ఐదుగురిని నియమించాయి. ముఖ్యంగా గెలుపునకు ప్రతికూలంగా ఉన్న ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టిసారించాయి. ఎంపిక చేసిన, చేయదలుచుకున్న అభ్యర్థుల గెలుపు అవకాశాలతో పాటు ఆయా నియోజకవర్గాలలో పార్టీల బలాబలాలు, ప్రజలలో పార్టీ, అభ్యర్థుల పట్ల ఉన్న ఆదరణ, అసంతృప్తిపై ఆరా తీస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి అత్యధిక సీట్లు డిమాండ్​ చేస్తున్న బీసీల అంశం ప్రభావాన్ని ప్రధాన పార్టీలన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఏయే నియోజకవర్గాలలో బీసీలు గెలుపును శాసిస్తారు? ఏ నియోజకవర్గంలో ఏ బీసీ నేత బలంగా ఉన్నారు? మైనార్టీ ఓట్లు అత్యధికంగా ఉన్న సెగ్మెంట్లలో ఆ వర్గం ఏ పార్టీకి జైకొడుతుంది? అనే సమాచారాన్ని రాబట్టే పనిలో పడ్డాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో చిన్న చితకా పార్టీలు సైతం సమరానికి సై అంటుండడంతో వారి ప్రభావం ఎలా ఉండబోతుంది? ఏ పార్టీతో జతకలిస్తే కలిసి అధికారంలోకి వస్తాం? అని ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే రంగంలో దిగిన ఏజెన్సీలు ఆయా పార్టీలు సూచించిన అంశాలపై చేపట్టిన సర్వేను ముమ్మరం చేశాయి. 

అధికారం పదిలమేనా?

ఇప్పటికే జెట్​స్పీడు తో 115 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్​, రెండు నెలల నుంచి పలు పథకాలను ప్రకటించింది. దీర్ఘకాలిక, అపరిష్కృత పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ 1.50 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పించింది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశలలో రూ.మూడు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నది. రేషన్​ డీలర్లకు క్వింటాలు బియ్యానికి ఇస్తున్న కమీషన్​ రూ. 70 నుండి రూ.140కు పెంచింది. మొన్నటి వరకు రూ. 3016 ఉన్న దివ్యాంగుల పెన్షన్ ను రూ.4,016 పెంచింది. బీసీ కులవృత్తులు, మైనార్టీలకు స్వయం ఉపాధి రుణాలు రూ. లక్షల చొప్పున ప్రకటించింది. 43,373మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. 14,954 మంది వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రతిపత్తిని కలిగించింది. వారి విద్యార్హతలు, సామర్థ్యాలను బట్టి ప్రభుత్వంలోని వివిధ శాఖలలో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా 14,954 పోస్టులను మంజూరు చేసింది. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా, దీపావళి పండుగల బోనస్‌ గా రూ. వెయ్యి కోట్లు పంపిణీ చేస్తామని ప్రకటించింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

డిక్లరేషన్లపై కాంగ్రెస్​ ప్రజాభిప్రాయం

వచ్చే ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్​పార్టీ ఇప్పటికే యూత్, రైతు, ఎస్టీ, ఎస్సీ డిక్లరేషన్లు ప్రకటించింది. ఇటు ఆసరా పెన్షన్లను రూ. నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ పథకాలలో చోటు చేసుకుంటోన్న అవినీతి గురించి ఆ పార్టీ నేతలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ గురించి తాము చేసిన ఆరోపణలను జనం నమ్ముతున్నారా? లేదా? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ గురించి, పార్టీ నేతల గురించి ఏమనుకుంటున్నారో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో ఉన్న కాంగ్రెస్​ అందులోని అంశాలను సైతం జనం నుంచి స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గాంధీభవన్​ లో కంట్రోల్​ రూం తో పాటు టోల్​ ఫ్రీ నెంబర్​ ఏర్పాటు చేసింది. 14 కమిటీల నియామకాన్ని పూర్తి చేసింది. 

అగ్రనేతలపైనే భారం

ప్రస్తుతం టీ బీజేపీలో స్తబ్దత నెలకొన్నది. ఎన్నికలు సమీపిస్తున్నా బీజేపీ మేనిఫెస్టో విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో క్యాడర్​ నిరాశలో ఉంది. తాము గెలిస్తే రాష్ట్రానికి ఏం చేస్తామనే విషయాన్ని ఇంత వరకు బీజేపీ నేతలు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో క్షేత్ర స్థాయి క్యాడర్‌లో కూడా ఎలాంటి ఉత్సాహం కనపడటం లేదు. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ఇటీవల 33 జిల్లాలతో పాటు 17 లోక్​ సభ స్ధానాలకు ఇన్చార్జులను ప్రకటించారు. పలు  కమిటీలను నియమించినా, క్షేత్రస్థాయిలో పనితీరు పై సొంత క్యాడర్​ లోనే అసంతృప్తి నెలకొన్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను ఎదుర్కొనేలా ఇన్చార్జుల ద్వారా సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. అసెంబ్లీ ఎలక్షన్స్‌ను బీజేపీ నేతలు లైట్‌గా తీసుకున్నారని పార్టీలోనే చర్చ జరుగుతోంది. రానున్న రోజులలో రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ, మోడీ, నడ్డా వంటి కీలక నేతల పర్యటనలపైనే రాష్ట్ర నేతలు ధీమాతో ఉన్నారు. ఖమ్మంలో అమిత్ షా సభ నిర్వహించినా ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో డైలామాలో పడిపోయారు. సెప్టెంబర్ 17న హైదరాబాదులో జరిగే సభ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యక్రమలపై దృష్టిపెట్టాలని భావిస్తున్నారు.