భోపాల్ లో తొలి బహిరంగ సభ 

భోపాల్ లో తొలి బహిరంగ సభ 
  • దేశవ్యాప్తంగా సంయుక్త ర్యాలీలు
  • ధరల పెరుగుదల , నిరుద్యోగంపై పోరాటం
  • సీట్ల పంపకాలపై చర్చలు ప్రారంభం  
  • ఇండియా కూటమి సమావేశ నిర్ణయాలు


(ముద్ర, నేషనల్ డెస్క్):-లోక్‌సభ ఎన్నికలలో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన విపక్ష ఇండియా కూటమి దేశవ్యాప్తంగా సంయుక్త ర్యాలీలు నిర్వహించేందుకు నిర్ణయించింది. తొలి ర్యాలీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లో అక్టోబర్‌లో నిర్వహించనుంది. ఢిల్లీలోని నేషనలిస్ట్​ కాంగ్రెస్ పార్టీ  చీఫ్ శరద్ పవార్ నివాసంలో బుధవారం సాయంత్రం జరిగిన ఇండియా బ్లాక్ సమన్వయ కమిటీ తొలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. డి.రాజా, జావెద్ అలీ, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, గుర్దీప్ సింగ్ సప్పల్, టీఆర్ బాలు, తేజస్వియాదవ్, సంజయ్ రౌత్, హేమంత్ సోరెన్, రాఘవ్ చడ్డా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ  ఈ సమావేశానికి హాజరయ్యారు. సమన్వయ కమిటీ సభ్యులైన జేడీయూ నేత లలన్ సింగ్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సమావేశంలో పాల్గొనలేదు. 
  
సమన్వయ కమిటీ నిర్ణయాలివే

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సంయుక్త బహిరంగ సభలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్టు సమవేశానంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్), ఇండియా బ్లాక్ సమన్వయ కమిటీ, ఎలక్షన్ స్ట్రాటజీ కమిటీ సభ్యుడు కేసీ వేణుగోపాల్ తెలిపారు. అక్టోబర్ తొలి వారంలో భోపాల్‌లో ఇండియా కూటమి తొలి సంయుక్త ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. బీజేపీ హయాంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, అవినీతి వంటి అంశాలను తాము లేవనెత్తనున్నట్టు చెప్పారు. జనగణన అంశాన్ని లేవనెత్తేందుకు కూడా పార్టీలు అంగీకరించాయని, సీట్ల పంపకాలను నిర్ణయించేందుకు ఉద్దేశించిన ప్రక్రియ ప్రారంభించాలని కూడా సమన్వయ కమిటీ నిర్ణయించిందని వివరించారు. సమన్వయ కమిటీ తొలి సమవేశంలో 12 పార్టీల సభ్యులు హజరయ్యారని కేసీ వేణుగోపాల్ వివరించారు.