అభివృద్ధిలో సర్పంచ్​లదే కీలక పాత్ర

అభివృద్ధిలో సర్పంచ్​లదే కీలక పాత్ర
  • జెడ్పీ చైర్మన్​ రాథోడ్​ జనార్దన్​

ముద్ర ప్రతినిధి, ఆదిలాబాద్ : గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర ప్రత్యేకమైనదని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 -లో భాగంగా జిల్లా స్థాయిలో ఉత్తమ అభివృద్ధి సాధించి ఎంపికైన గ్రామ పంచాయతీలకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో  కలెక్టర్ తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. గాంధీజీ కలలు కన్నా సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని తెలిపారు. పల్లె ప్రగతి, హరితహారం, వివిధ సంక్షేమ పథకాల అమలులో సర్పంచులు, అధికారులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇదే స్పూర్తితో పని చేసి మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేయాలనీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. మాట్లాడుతూ గ్రామపంచాయతీలను జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా తీర్చిదిద్దాలన్నారు.

జిల్లా స్థాయిల్లో ఉత్తమ గ్రామపంచాయితీలు ఎంపికైన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు తగ్గు ముఖం పట్టాయని అన్నారు. జిల్లాలో ఉత్తమ అభివృద్ధి సాధించిన గ్రామపంచాయితీలు 19 ఎంపికయ్యాయని తెలిపారు. ఈ అవార్డులను పొందిన గ్రామపంచాయతీలను స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని అన్ని గ్రామపంచాతీలు అభివృద్ధి సాధిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఈ నెల 15 నుంచి 17 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రతి గ్రామంలో అధికారులు, ప్రజ్రప్రతినిధులు, ప్రజలు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఉత్తమ గ్రామపంచాయితీలుగా ఎంపికైన మండల, గ్రామ స్థాయి అధికారులు, సర్పంచులను శాలువా, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్త, జడ్పీ సీఈఓ గణపతి, జిల్లాల పంచాయితీ అధికారి శ్రీనివాస్, జడ్పీటీసీ లు, ఎంపీపీలు, ఎంపీడీఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.