Vijayawada Fire Accident -మెడికల్‌ గోడౌన్‌ లో మంటలు.. రూ. 5 కోట్ల పైనే నష్టం!

ముద్ర,విజయవాడ:- విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బందర్​ రోడ్​లోని ఓ మెడికల్​ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని భారీగా పొగ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికి గోడౌన్​ లోపల పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.

మెడికల్​ గోదాం నుంచి ఎగిసిపడుతున్న మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.  5 అగ్నిమాపక వాహనాల ద్వారా మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో గోడౌన్​లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గోడౌన్​లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా రూ. 5 కోట్ల పైనే నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.