వరల్డ్​ కప్​ ఆసీస్​దే

వరల్డ్​ కప్​ ఆసీస్​దే
  • ఆరు వికెట్ల తేడాతో విజయం
  • విజృంభించిన ట్రావీస్​ హెడ్​, మార్నస్​
  • 43 ఓవర్లలోనే విజయాన్నందుకున్న ఆసీస్​

అహ్మదాబాద్​: బిగ్​ఫైట్​లో భారత పరాజయాన్ని మూటగట్టుకుంది. మూడోసారి క్రికెట్​ వరల్డ్​ కప్​లో విశ్వవిజేతగా నిలుస్తుందనుకున్న ఆశలు కాస్తా అడియాశలయ్యాయి. ఆరోసారి ఆసీస్​ వరల్డ్​కప్​ను ఎగరేసుకుపోయింది. బ్యాటింగ్​లో వైఫలమ్యే ఓటమికి కారణంగా మారింది. ఆసీస్​ బ్యాటర్లు ఈ వైఫల్యాన్ని అలవోకగా అధిగమించి విజయాన్ని, కప్​ను తమ ఖాతాలో వేసుకొని సత్తా చాటారు. టాస్​గెలిచి ఆసీస్ ఫీల్డింగ్​ ఎంచుకుంది. బరిలోకి దిగిన భారత్​ ఓపెనర్లు రోహిత్​ శర్మ మంచి ఆరంభాన్నిచ్చినప్పటికీ శుభమన్​గిల్​ 4 పరుగుల వద్దే వెనుదిరిగాడు. రెండో వికెట్​గా వచ్చిన కోహ్లీ రోహిత్​ సరసన కుదురుకున్నట్లే కనిపిస్తుండగా, పవర్​ప్లే 10 ఓవర్లలోనే రోహిత్​ శర్మ కాస్త 47 పరుగుల వద్ద గ్లేన్ మ్యాక్స్‌వెల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ పంపించాడు.

ఈ దశలో బ్యాటింగ్​కు దిగిన శ్రేయాస్​ అయ్యర్​ రానిస్తాడనుకుంటే స్వల్ప స్కోరు వద్దే (4) వెనుదిరిగాడు. దీంతో భారత్​ కష్టాల్లో పడింది. కోహ్లీకి జతగా కె.ఎల్​.రాహుల్​ ధీటుగానే ఆడాడు. ఈ దశలో కోహ్లీ 64 బంతుల్లో (54) పరుగుల వద్ద స్లో షాట్ పిచ్ బాల్‌ను థర్డ్ మ్యాన్ దిశగా ఆడబోయి విరాట్​ వికెట్​ను చేజార్చుకున్నాడు. ఈ పరిస్థితుల్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌ కోసం రవీంద్ర జడేజా బ్యాటింగ్​కు దిగినా తక్కువ పరుగుల వద్దే అదను వెనుదిరిగాడు. అప్పటికే రాహుల్​ హాఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్ బౌలింగ్‌లో రాహుల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలు నిరాశపరిచారు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే పోరాటపటిమను ఆటలో కొనసాగిస్తున్నట్లు కనిపించినా ఎక్కువ పరుగులు రాబట్టలేక చతికిల పడ్డాడు. ఇక చివరలో సిరాజ్(9 నాటౌట్).. చివరి ఓవర్‌లో విలువైన బౌండరీ బాదాడు. ఆఖరి బంతికి క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో కుల్దీప్ యాదవ్(10) రనౌటయ్యాడు.

భారత్​ స్కోరు: రోహిత్​ శర్మ (47), శుభ్​మన్​ గిల్​ (4), విరాట్​ కోహ్లీ (54), శ్రేయాస్​ అయ్యర్​ (4), కె.ఎల్​. రాహుల్​ (66), రవీంద్ర జడేజా (9), సూర్యకుమార్​ యాదవ్​ (18), మహమ్మద్​ షమీ (6), జస్​ప్రీత్​ బూమ్రా (1), కుల్​దీప్​ యాదవ్​ (10), మహమ్మద్​ సిరాజ్​ (9–నాటౌట్​). భారత్​ 50 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. ఆసీస్​కు 241 విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్లు: మిట్చెల్​ స్టార్క్​ (3–గిల్​,రాహుల్​, షమీ), జోష్​ హజీల్​వుడ్​ (2–రవీంద్ర జడేజా, సూర్యకుమార్​ యాదవ్​), ప్యాట్​ కమ్మిన్స్​ (2–అయ్యర్​, కోహ్లీ), మాక్స్​వెల్​ (1–రోహిత్​ శర్మ), ఆడమ్​ జంపా (1–జస్​ప్రీత్​ బూమ్రా). 241 విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆసీస్​ను భారత్​ స్వల్పస్కోరు వద్దే రెండు మూడు వికెట్లు తీసినప్పటికీ మూడో భాగస్వామ్యంలో ట్రావీస్​ హెడ్​, మార్నస్​ల ఆటతీరుతో గెలుపు సాధ్యమైంది. హెడ్​ (137) మార్నస్​ (58) పరుగులు సాధించి ఆసీస్​ను విజయతీరాలకు చేర్చారు. వికెట్ల పరంగా చూసుకుంటే జస్​ప్రీత్​ బూమ్రా 2, మహమ్మద్​ షమీ 1, సిరాజ్​ 1 వికెట్లు సాధించారు.  కాగా 43 ఓవర్లలోనే ఆసీస్​ 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది.