ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి విధ్వంసం సృష్టించిన: రింకు సింగ్

ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి విధ్వంసం సృష్టించిన: రింకు సింగ్

నైట్ రైడర్స్ ప్లేయర్ రింకు సింగ్ ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పకున్నాడు. రాత్రికి రాత్రే పాపులారిటీ సాధించాడు. సహచరులతో పాటు క్రికెట్ పండితుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. కేకేఆర్ జట్టు ఓనర్ షారుఖ్ ఖాన్ నుంచి ప్రత్యేక అభినందనలు పొందాడు.  ఏప్రిల్ 9న  రింకు సింగ్ ఆడిన ఒక్క ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. ఓటమి అంచున ఉన్న కోల్ కత్తా జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. చివరి ఓవర్లో చివరి 5 బంతులకు 5 సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.  గత 5 సంవత్సరాలుగా కోల్ కతా జట్టుతో ఉన్న రింకు సింగ్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్నాడు.

రింకు సింగ్ క్రికెట్ ప్రయాణం స్పూర్తిదాయకం

రింకూ సింగ్ ఉత్తర ప్రదేశ్ అలీఘర్ ప్రాంతానికి చెందిన వాడు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రింకు సింగ్ ఎంతో కష్టపడి పైకి ఎదిగాడు. అడుగడుగునా తన కుటుంబం రింకుకు సహకరించింది. రింకు సింగ్ తండ్రి ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేవారు. రింకు సింగ్ ఐదుగురు తోబుట్టువుల్లో మూడోవాడు.  రెండు గదులు ఉన్న ఓ చిన్న ఇంట్లో  తొమ్మిదిమంది నివాసం  ఉండేవారు. తల్లిదండ్రులు, చెల్లెలు, అన్న జీతూసింగ్, చెల్లెలు నేహాసింగ్, వదిన, వారి పిల్లలతో కలిసి రింకు సింగ్ నివసించేవాడు. తల్లి వీణా దేవి గృహణి. అన్న జీతూసింగ్ ఆటోడ్రైవర్. ఇటువంటి కుటుంబ నేపథ్యం ఉన్న రింకు సింగ్ క్రికెట్ ఇష్టపడడం చూసి కుటుంబ సభ్యులందరూ సహకరించారు. కుటుంబ సభ్యులకు తాను భారం కాకూడదనే ఉద్దేశ్యంతో రింకు సింగ్ కూడా చిన్న చిన్న పనులు చేసేవాడు. వాటి ద్వారా కొంత డబ్బు సంపాదించేవాడు. కొన్ని రోజుల పాటు ఓ కంపెనీలో స్వీపర్ ఉద్యోగం కూడా చేశాడు. కొంత కాలం పాటు ఆటో డ్రైవర్ గా కూడా ఉన్నాడు.

 చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్

రింకు సింగ్ తపన చూసిన  ఓ క్రికెట్ కోచ్ సాయం అందించాడు. మంచి ప్లేయర్ గా తీర్చిదిద్దాడు. రింకు శ్రమకు అదృష్టం కలిసి వచ్చింది. 2017లో పంజాబ్ జట్టు తరపున ఐపీఎల్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. 10 లక్షల ధరకు పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. ఆ తర్వాతి ఏడాదిలో కోల్ కత్తా జట్టు ఏకంగా రూ. 80 లక్షలు పెట్టి రింకు సింగ్ ను తన జట్టులోకి తీసుకుంది. 2018 నుంచి 2020 వరకు మూడు సంవత్సరాల పాటు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 2021లో గాయం కారణంగా ఐపీఎల్ ఆడలేకపోయాడు. 2022లో ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ రింకుపై కేకేఆర్ జట్టు యాజమాన్యం నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా రింకు సింగ్ గుజరాత్ జట్టుపై పరుగుల వరద పారించాడు. చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.