IPL Live Updates రిషభ్ పంత్, బుమ్రాల స్థానాల భర్తీ

IPL Live Updates రిషభ్ పంత్, బుమ్రాల స్థానాల భర్తీ

గాయాల కారణంగా ఐపీఎల్‌కు దూరమైన ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్  స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాల స్థానంలో కొత్త ఆటగాళ్లు వచ్చేశారు. పంత్ స్థానాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ అభిషేక్ పోరెల్‌తో భర్తీ చేయగా, బుమ్రా స్థానంలో సందీప్ వారియర్ ను ముంబై చేర్చుకుంది. పంత్, బుమ్రా ఇద్దరూ ఐపీఎల్‌కు దూరమైన విషయం చాలా కాలం క్రితమే తెలిసినప్పటికీ ఆగమేఘాల మీద ఎవరినో ఒకరిని తీసుకోకుండా ఇరు జట్లు ఆచితూచి వ్యవహరించాయి. తమను తాము నిరూపించుకున్న ఇద్దరు ఆటగాళ్లను ఎంచుకున్నాయి. గతేడాది డిసెంబరు 30న రూర్కీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

వెన్ను నొప్పి కారణంగా బుమ్రా చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆసియా కప్‌తోపాటు టీ20 ప్రపంచకప్‌లో కూడా బుమ్రా ఆడలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన పోరెల్ బెంగాల్ తరపున 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లతోపాటు 3 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, అన్నే సంఖ్యలో టీ20లు ఆడాడు. సందీప్ వారియర్ భారత జట్టు తరపున 68 టీ20లు ఆడాడు. 62 వికెట్లు తీసుకున్నాడు. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరకు ప్రాతినిధ్యం వహించాడు. 5 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.  పోరెల్‌ను ఢిల్లీ రూ. 20 లక్షలకు తీసుకోగా, సందీప్ వారియర్‌ను ముంబై రూ. 50 లక్షలకు తీసుకుంది. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2న చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడుతుంది. 29 ఏళ్ల బుమ్రా ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో వెన్నుకు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఫలితంగా ఐపీఎల్‌తోపాటు ఈ ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కూడా దూరమయ్యాడు. అయితే, ఈ ఏడాది అక్టోబరు, -నవంబరులో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు మాత్రం బుమ్రా అందుబాటులో ఉంటాడని సమాచారం.