వెల్లింగ్టన్ రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ శతకం 

వెల్లింగ్టన్ రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ శతకం 

వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ శతకం బాదాడు. ఫాలో ఆన్ ఆడుతూ కివీస్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో విలియమ్సన్ అసాధారణ పోరాటం చేశాడు. 282 బంతుల్లో 132 పరుగులు చేశాడు. ఓపెనర్లు టామ్ లాథమ్ (83), కాన్వే (61) తొలి వికెట్‌కు 149 పరుగులు జోడించారు. కానీ 167 పరుగులకే కివీస్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. హెన్రీ నికోలస్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించిన కేన్.. డారెల్ మిచెల్ (54)తో కలిసి ఐదో వికెట్‌కు 75 రన్స్ జోడించాడు. ఆ తర్వాత టామ్ బ్లండెల్‌ (90)తో కలిసి ఆరో వికెట్‌కు 158 పరుగులు జోడించాక.. ఇంగ్లాండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బ్రూక్‌‌కు ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. దీంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులు చేయగలిగింది. 2021 ఆరంభం నుంచి కేన్ విలియమ్సన్‌కు టెస్టుల్లో ఇది రెండో శతకం కావడం గమనార్హం. గత ఏడాది చివర్లో కేన్ పాకిస్థాన్‌పై డబుల్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 226 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. చివరి రోజు ఇంగ్లిష్ జట్టు విజయానికి 210 పరుగులు అవసరం కాగా.. కివీస్ విజయానికి 9 వికెట్ల దూరంలో ఉంది.
శతకంతో న్యూజిలాండ్‌ను ఆదుకున్న విలియమ్సన్.. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన కివీస్ బ్యాటర్‌గా రాస్ టేలర్‌ను వెనక్కి నెట్టాడు. 112 టెస్టులు ఆడిన టేలర్ 7683 పరుగులు చేయగా.. విలియమ్సన్ 7787 రన్స్ చేశాడు. కేన్ 92 టెస్టుల్లోనే టేలర్ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు, హాఫ్ సెంచరీలు, బెస్ట్ యావరేజ్, అత్యధిక డబుల్ సెంచరీలు కేన్ విలియమ్సన్ పేరిటే ఉన్నాయి.


వెల్లింగ్టన్ టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. రూట్ (153 నాటౌట్), హ్యారీ బ్రూక్ (186) భారీ శతకాలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌‌ను 435/8 వద్ద డిక్లేర్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 209 పరుగులకే ఆలౌటయ్యింది. 9వ స్థానంలో బ్యాటింగ్ చేసిన కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ 49 బంతుల్లోనే 73 పరుగులతో సత్తా చాటాడు. ఆరు సిక్సులు బాదిన టిమ్.. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు.