నష్టాల్లో ట్రేడవుతున్న భారత స్టాక్​మార్కెట్​

నష్టాల్లో ట్రేడవుతున్న భారత స్టాక్​మార్కెట్​

అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆటో, మెటల్, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లు పడిపోతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 300 పాయింట్లకుపైగా కోల్పోయి 59 వేల 150 మార్కు వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 100 పాయింట్లు పడిపోయి 17 వేల 350 మార్కు వద్ద ట్రేడవుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. దీంతో దేశీయ సూచీలు ఇవాళ ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని అమ్మకాలు జరుగుతున్నాయి. నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 1.69 శాతం పతనమైంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.02 శాతం మేర పడిపోయింది. S&P 500 ఇండెక్స్ 1.05 శాతం మేర నష్టాలతో ముగిసింది. శుక్రవారం రోజు అమెరికా మార్కెట్ల బాటలోనే.. ఆసియా సూచీలు ఇప్పుడు ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.96 శాతం పడిపోగా.. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.15 శాతం నష్టపోయింది.  ప్రస్తుతం కోటక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ రాణిస్తుండగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఆటో, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డీలాపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. ఫిబ్రవరి 24 డేటా ప్రకారం.. ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FII) నికర అమ్మకందారులుగా ఉండగా.. డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (DII) నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. FII లు రూ.1470.34 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. DII లు రూ. 1400.98 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.