హైదరాబాద్​లో మరో భారీ షాపింగ్​ మాల్​

హైదరాబాద్​లో మరో భారీ షాపింగ్​ మాల్​
  • నేడు మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా లులు మాల్​ ప్రారంభం
  • గతంలోనే దావోస్​లో ఒప్పందం
  • రూ. 3,500 కోట్ల పెట్టుబడి
  • వివరాలు వెల్లడించిన లులు ప్రతినిధులు

ముద్ర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో మరో కొత్త షాపింగ్ మాల్ రాబోతుంది. లులు మాల్ తొలిసారిగా తెలంగాణలో తన స్టోర్​ను ప్రారంభించబోతోంది. నేడు కూకట్ పల్లిలోని ఓల్డ్​ మంజీరా మాల్​ను మార్పులు, చేర్పులు చేసి లులు మాల్ ఘనంగా ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న భారీ షాపింగ్ మాల్స్ సరసన ఈ లులు షాపింగ్ మాల్ కూడా చేరనుంది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లులు మాల్ ఉంటుందని, అందులో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లులు హైపర్ మార్కెట్ ఉంటుందనని ఆ కంపెనీ డైరెక్టర్​ఆనంద్​ ఏవీ, సీఈఓఆశ్రఫ్​ అలీ, కంపెనీ ప్రతినిధులు నిశాద్​, తెలంగాణ రీజనల్​ మేనేజర్​ అబ్దుల్​ ఖాదీర్​ షేక్​, మార్కెటింగ్​ హెడ్​ నందకుమార్​ తెలిపారు. బుధవారం మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా ఈ మాల్​ను ప్రారంభించనున్నారు. లులు గ్రూప్ తెలంగాణలోకి అడుగు పెట్టబోతున్న విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. రాష్ట్రంలో రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. 

లులు షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల ద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. రూ.2,500 కోట్లతో మరో డెస్టినేషన్ మాల్ ను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోని బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చి, లక్నో, కోయంబత్తూర్ లో లులు షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరబోతోంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత సంవత్సరం దావోస్ లో వరల్డ్ ఏకనామిక్ ఫోరం కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే లులు మాల్ ను తెలంగాణలో ఏర్పాటు చేసే విషయంపై చర్చలు జరిగాయి. అనంతరం లులు గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో కూడా లులు మాల్ ప్రారంభించేందుకు లులు గ్రూప్ సిద్ధం అవుతున్నది. 

కూకట్ పల్లిలో ఏర్పాటు చేయనున్న లులు మాల్ మాత్రమే కాకుండా.. ఎగుమతులే లక్ష్యంతో  అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను కూడా లులు గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ను రూ. 200 కోట్లతో రోజుకు 60 టన్నుల మాంసం ఉత్పత్తి సామర్థ్యంతో చెంగిచర్లలో ఏర్పాటు చేయనుంది. ఈ మాల్ లో 200 కి పైగా దుకాణాలు ఉంటాయి. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఉంటాయి. 5 థియేటర్లు కూడా నిర్మించారు. మల్టీ కుషన్ ఫుడ్ కోర్టు, పిల్లల కోసం ఎంటర్‌టైన్మెంట్ జోన్లు, దేశీయ, విదేశీ బ్రాండ్లతో కూడిన రిటైలర్లు, ప్రేయర్ హాల్, మెడికల్ సెంటర్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఈ మాల్ లో ఒకేసారి వేయికిపైగా కార్లను పార్కింగ్ చేసేలా నిర్మాణం చేశారు.