నష్టాల్లో యెస్‌ బ్యాంక్‌ షేర్లు

నష్టాల్లో యెస్‌ బ్యాంక్‌ షేర్లు

ముంబయి: యెస్‌ బ్యాంక్‌ షేర్లు సోమవారం నష్టాల్లో పయనిస్తున్నాయి. ఉదయం దాదాపు 12 శాతం నష్టపోయిన షేరు రూ.14.40 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.  కొనుగోళ్ల మద్దతుతో తర్వాత కనిష్ఠాల నుంచి పుంజుకుంది. ఉదయం 11:44 గంటల సమయంలో 3.94 శాతం నష్టపోయి రూ.15.85 వద్ద ట్రేడవుతోంది.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విధించిన మూడేళ్ల లాకిన్‌ గడువు సోమవారంతో ముగియనుంది. దీంతో వ్యక్తిగత మదుపర్లతో పాటు ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌ల) నుంచి యెస్‌ బ్యాంక్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని 9 బ్యాంకుల కన్సార్షియం 2020 మార్చిలో యెస్‌ బ్యాంక్‌లో సుమారు 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.8 ప్రీమియంతో కలిపి రూ.10కు కొనుగోలు చేసింది. ఆర్‌బీఐ ఉద్దీపన ప్రణాళికలో భాగంగా, ఈ వాటా కొనుగోలుకు ఎస్‌బీఐ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.  ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు కూడా ఈ షేర్లను విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద రిటైల్‌, హెచ్‌ఎన్‌ఐలు, ఎన్‌ఆర్‌ఐలు వంటి వ్యక్తిగత మదుపర్ల వద్ద 135 కోట్ల యెస్‌ బ్యాంక్‌ షేర్లు లాకిన్‌ గడువులో ఉన్నాయి. మరో 6.7 కోట్ల షేర్లు ఈటీఎఫ్‌ల వద్ద ఉన్నాయి. అందరూ నేటి మార్కెట్‌లో షేర్లను విక్రయించకపోయినా, వచ్చే కొన్ని వారాల్లో యెస్‌ బ్యాంక్‌ షేర్లపై ఒత్తిడి కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.