మంచిర్యాల జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం

మంచిర్యాల జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం
  • మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ మోహన్ జోషి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ  క్షేత్రస్థాయిలో బలోపేతంగా ఉందని రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగుర వేయడం తథ్యమని మహారాష్ట్ర కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు మోహన్ జోషి అన్నారు. ఆదివారం మంచిర్యాల నియోజకవర్గం ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా మోహన్ జోషి మాట్లాడుతూ, జాతీయ అధిష్ఠానం తనను పరిశీలకుడి గా నియమించడంతో రావడం జరిగిందన్నారు. మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేంత వరకు తాను ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ లో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు    దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని కొనియాడారు.

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ బలం పుంజుకుందని తెలిపారు. అనంతరం ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. కరోన సమయంలో బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో కి తీసుకువచ్చి అనేకమంది వ్యాధి గ్రస్థులకు ఆరోగ్యం ప్రసాదించినట్లు చెప్పారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా  చేసినట్లు ఆయనకు వివరించారు. అంతే కాకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు భోజనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే వరద ముంపు ప్రాంతాల బాధితులకు భోజనాలు, అల్పాహారం ఏర్పాటు చేసి ఆదుకున్నామని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని తెలిపారు. ప్రేమ్ సాగర్ రావు సారధ్యంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బల పడుతుందని తెలిపారు. కర్ణాటక ఎన్నికల తర్వాత  కాంగ్రెస్కు మరింత బలం పెరిగి ఇతర పార్టీల వారు కాంగ్రెస్లో చేరే శుభపరిణామాలు సంభవించాయని అన్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి వెంకటరమణ, యువజన కాంగ్రెస్ పరిశీలకుడు వినోద్ పటేల్ పాల్గొన్నారు.