అవినీతివాలయంలో తూనికల, కొలతల శాఖ...

అవినీతివాలయంలో తూనికల, కొలతల శాఖ...
  • రెన్యువల్ పేరుతో దోపిడికి పాల్పడుతున్న అధికారులు...
  • సిబ్బంది కొరతతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న అధికారులు...
  • ఈ అవినీతికి సూత్రధారి ఏసి రాజేశ్వర్ అంటూ ఆరోపణ.

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: రాష్ట్రంలో తూనికల, కొలతల శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. లైసెన్స్ దారులను అడ్డం పెట్టుకొని జిల్లా శాఖ అధికారులు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో తూనికలు, కొలతల శాఖలో తీవ్ర స్థాయిలో సిబ్బంది కొరత ఏర్పడింది. వాస్తవానికి 3 మండలాలకు అధికారి, ఇద్దరు టెక్నికల్ అధికారులు, ఒక ల్యాబ్ అసిస్టెంట్, ఇద్దరు అధికారులు ఉండాలి. కానీ ఆ స్థితి ఎక్కడ కనిపించడం లేదు. జిల్లాస్థాయి తూనికల అధికారికి రెండు, నుంచి మూడు జిల్లాలకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఇది వీరికి వరంగా మారింది. లైసెన్స్ దారులను మధ్యవర్తులుగా పెట్టుకొని, ఇష్టానుసారంగా దోపిడికి పాల్పడుతున్నారు. దానికి తోడు జిల్లా తూనికలు, కొలతల అధికారులు రెన్యువల్ పేరుతో ఎక్కువగా దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన బిల్లు ఒకటైతే లైసెన్స్ దారుల పేరుతో మరో బిల్లు ఇలా రెండేసి బిల్ ఇస్తూ షాప్ యజమానులను అడ్డంగా దోచేస్తున్నారు. వాస్తవానికి ఎలక్ట్రానిక్ కాంటాలను సంవత్సరానికి ఒకసారి, మాన్యువల్ కాంటాలను రెండు సంవత్సర ఒకసారి రెన్యువల్ చేయాల్సి ఉండగా, నిబంధనలను తుంగలో తొక్కి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు.

వసూళ్ల పర్వం ఇలా...

మరమ్మత్తులు, రెన్యువల్ పేరుతో లైసెన్స్ దారులు జిల్లాస్థాయి అధికారులు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఎలక్ట్రానిక్ కాంటాలను సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. మ్యానువల్ కాంటాలను రెండు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. కానీ అధికారులు లైసెన్స్ దారులను అడ్డం పెట్టుకొని మ్యానువల్ కాంటాలను సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ తీసుకోవాలని షాప్ యజమానులను బయందోళనకు గురిచేసి అడ్డగోలుగా దోచుకుంటున్నట్టు ఆరోపనాలు ఉన్నాయి. వాస్తవానికి రెన్యువల్ ఫీజు ఒక గ్రాము నుండి 20 కేజీల వరకు కేవలం పది రూపాయలు మాత్రమే, 30 కేజీల నుండి 50 కేజీల వరకు 40 రూపాయల ఫీజు ఉంటుంది. కానీ 1300 వందల రూపాయల నుండి 5వేల వరకు వసూళ్లు చేస్తుంటే వీరి యొక్క వసూళ్ల పర్వం ఎంతగా ఉంటుందో ఇట్లే అర్థమవుతుంది. మాన్యువల్ కాంటాలు అయితే పరిమాణానికి తగ్గట్టుగా రెన్యువల్ ఫీజు వసూలు చేయాలి.

కానీ అధికారులు ఇవన్నీ పట్టించుకోవడం లేదని విమర్శ ఉంది. దానికి తోడు అదనంగా 400 రూపాయలు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. పెట్రోల్ బంకుల యజమానుల నుండి జిల్లా స్థాయి అధికారులకు నెల నెల మామూళ్లు ముట్టుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పెట్రోల్ బంక్ లో ఉన్న నాజల్ ను సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేయాలి. వాస్తవానికి రెన్యువల్ ఫీజు 1720 రూపాయలు కానీ, అధికారులు అధికంగా వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు ఇన్స్పెక్షన్ పేరుతో ఒక బంకు నుండి 10 లీటర్ల పెట్రోలు గాని, డీజిల్ గాని తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వే బ్రిడ్జి కాంటాల రెన్యువల్ చార్జీ 3000 వేల రూపాయలు ఉంటుంది. కానీ అధికారులు 12,000 దాకా వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రభుత్వానికి చెల్లించేది కేవలం 3వేల రూపాయలు మాత్రమే మిగతాది నేరుగా వీరి జోబులోకి వెళ్ళిపోతుంది.

జాతరలు వస్తే పండుగే

రాష్ట్రంలో ఎక్కడ జాతర జరిగిన కొలతలు, తూనికల అధికారులకు కాసుల వర్షం కురిసినట్టే, జాతరలో ఎన్ని చికెన్, మటన్ షాపులు ఉన్న ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఇచ్చుకోవాల్సిందే. లేదంటే, కేసులు వేస్తామని షాప్ యజమానులు బయందోళనకు గురు చేస్తూ ముప్ప తిప్పలు పెడుతూ, అధికారులు తమ ఉగ్రరూపాన్ని చూపిస్తూ రాళ్లను తీసుకెళ్తారు. వీరికి భయపడి ప్రతి ఒక్క షాప్ యజమాని వెయ్యి రూపాయల మొక్కుబడి చెల్లించుకోవలసిన పరిస్థితి ఉంది.

వీధి వ్యాపారులను సహితం కూడా వదలని అధికారులు

ఆయా జిల్లాలో ఉన్న తూనికల, కొలతల అధికారులతో పాటు లైసెన్స్ దారులు విధి వ్యాపారులను కూడా వదలడం లేదు. నెత్తిన బుట్ట పెట్టుకొని వీదుల గుండా కూరగాయలు, పండ్లు అమ్ముకొని పొట్ట పోసుకుంటున్న వారిని కూడా వదలడం లేదనే ఆరోపణ ఉంది. వారితో 100 రూపాయల నుండి 300 దాకా వసూలు చేసుకుని దర్జాగా వెళ్ళిపోతున్నట్టు విమర్శ ఉంది. వీరికి బిల్లు కాగితం గిట్ల ఏమి ఇవ్వరు. రోడ్డుపైన పండ్లు, కూరగాయలు అమ్ముతున్న వారిని సైతం వదలడం లేదు. వీరు ఒక్కసారి బయటికి వచ్చారంటే 50వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు అక్రమంగా తీసుకెళ్తున్నట్టు వినికిడి. ఏమీ లేని పక్షంలో ఆయా కిరణా షాపుల వద్దకు వెళ్లి దాన్ని, దీన్ని చూసి దీనికి ఎంఆర్పి రేట్ లేదు, దీనికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అంటూ ఏదో సాకుతో దోపిడే లక్ష్యంగా మీరు పని చేస్తున్నట్టు తెలుస్తుంది.

కార్యాలయంలో కల్పించిన అధికారులు

కార్యాలయానికి ఫిర్యాదు చేద్దామనో, లేదా సమాచారం అడుగుదామనో వెళ్లిన వ్యక్తులకు కార్యాలయంలో ఏ ఒక్కరు కనిపించరు. కార్యాలయం తాళం వేశో, లేదా ఒక్క అటెండర్ మాత్రమే కార్యాలయంలో దర్శనమిస్తూ ఉంటారు. ఎప్పుడు వెళ్లిన ఇదే తంతు, సార్ వాళ్లు ఎక్కడికి వెళ్లారు అని అక్కడ ఉన్న అటెండర్ ను అడిగిన నాకు తెలియదు అంటూ సమాధానం. అసలు ఏమి చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు. అన్న సమాచారం కార్యాలయంలో ఉండదు.

ఈ అవినీతికి మూల కారకులు ఎవరు

రాష్ట్రంలో తూనికల, కొలతల శాఖలో అవినీతి రాజ్యమేలుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఇంతటి అవినీతికి ప్రధాన సూత్రధారి ఎవరు? ఇందుకు మూల సూత్రధారి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న అడిషనల్ కంట్రోలర్ రాజేశ్వర్ అంటూ విశ్వాస వర్గాల ద్వారా సమాచారం, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న అధికారులు మాసానికి రెండు లక్షల రూపాయలు సదరు అధికారికి ముడుపుల రూపంలో చెల్లించాలని రూల్ పెట్టారని సమాచారం. ఈ రూల్ అతిక్రమిస్తే వారు బదిలీ కావడమో లేక వేరే పోస్ట్ కు వెళ్లడమో ఈయన చేస్తున్నట్టు ఆరోపణ ఉంది. ఈ రూల్ కు భయపడి జిల్లా స్థాయిలో పనిచేస్తున్న తూనికలు, కొలతల అధికారులు అడ్డగోలుగా దోచుకొని సదరు అధికారికి మాసానికి రెండు లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్టు సమాచారం.

అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్ పదవి విరమణ కాలం దగ్గర పడుతున్నడంతో అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు ఆరోపనాలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ నాగర్ కర్నూల్ జిల్లా స్థాయి తూనికలు, కొలతల అధికారిగా బాధ్యతలు చేపట్టడానికి ప్రధాన కారణం ఇదేనంటూ కొందరు ఆరోపణ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తూనికల అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకు యజమానులతో ఒక ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది.

అడ్డుకట్ట వేసేది ఎవరు?

రాష్ట్రంలో తూనికలు, కొలతల శాఖ అధికారుల అవినీతి ఎక్కువవుతున్న తరుణంలో దీనిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.