ఎవరెస్ట్ మసాలాల సంస్థకు సింగపూర్ షాక్.. !

ఎవరెస్ట్ మసాలాల సంస్థకు సింగపూర్ షాక్.. !

హైదరాబాద్, ముద్ర సెంట్రల్ డెస్క్: భారత్ లో ప్రసిద్ధమైన మసాలా ద్రవ్యాల తయారీ సంస్థ ఎవరెస్ట్ (EVEREST)కు సింగపూర్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ కంపెనీ తయారు చేసిన చేపల కూర మసాలలో ఇథిలీన్ ఆక్సైడ్ స్థాయి మోతాదుకు మించి వుందని పేర్కొంటూ దాన్ని వెనక్కి తీసుకోవాలని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) ఆదేశించింది. దేశంలో ఇప్పటిదాకా ఎవరైనా ఈ మసాలాను కొనుగోలు చేసివుంటే, దాన్ని వినియోగించవద్దని సూచించింది. ఈ మేరకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఒక ప్రకటనను విడుదల చేసింది. సింగపూర్ దేశానికి ఎవరెస్ట్ మసాలాలను దిగుమతి చేసుకునే సంస్థ ఎస్ పి ముత్తయ్య అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఆ స్టాక్ ను వెనక్కి పంపించేయాలని ఆదేశించింది. ఇథిలీన్ ఆక్సైడ్ ను ఆహారంలో వినియోగించరని, సేద్యంలో సూక్ష్మజీవుల నివారణకు మాత్రమే ఉపయోగిస్తారని పేర్కొంది. ఇధిలీన్ ఆక్సైడ్ ను ఆహారపదార్థాల్లో వినియోగించడాన్ని సింగపూర్ ఫుడ్ రెగ్యులేషన్స్ సంస్థ అనుమతించదని పేర్కొంది. అయితే, దీన్ని వినియోగించడం వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే సమస్య ఏమీ లేకపోయినా కూడా దీని వాడకాన్ని వీలైనంత తగ్గించడమే మంచిదని పేర్కొంది. ఎవరెస్ట్ ఉత్పత్తిలో ఇథిలీన్ ఆక్సైడ్ స్థాయిలు అనుమతించదగిన స్థాయిలను మించిపోతున్నాయని సూచించే ఆహార భద్రత కోసం హాంకాంగ్ కేంద్రం నుంచి అందిన నోటిఫికేషన్ ఫలితంగా ఎవరెస్ట్ ఉత్పత్తిని రీకాల్ చేస్తున్నారు.

"ఇథిలీన్ ఆక్సైడ్ అనుమతించదగిన పరిమితులను మించిన స్థాయిలో ఉన్నందున హాంకాంగ్‌లోని ఫుడ్ సేఫ్టీ సెంటర్ భారతదేశం నుంచి దిగుమతి అయిన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలను వెనక్కి పంపించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది" అని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

 యుఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఇథిలీన్ ఆక్సైడ్‌కు ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల కళ్ళు, చర్మం, ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తుల చికాకు మరియు మెదడు మరియు నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది.