వైసీపీలో అసమ్మతి గళాలు...

వైసీపీలో  అసమ్మతి గళాలు...
anam ramnarayanareddy

ఏపీ సిఎం , వైసీపీ అధినేతపై నిన్నటివరకు ప్రతిపక్షాలే విమర్శలు, ఆరోపణలు చేసేవి. కానీ ఇప్పుడు సొంత పార్టీలో కొందరు నేతలు నిరసన గళమెత్తుతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు రాను రాను ఈ సంఖ్య పెరుగుతూండటం ఆ పార్టీలో కలవరం రేపుతోంది. వైసీపీ నేతల ధిక్కార స్వరానికి కారణం ఏమిటన్నదానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కొంతమంది, ఎమ్మెల్యేలు సర్దుకుంటున్నారని కొంత మంది.. టిక్కెట్‌ దక్కే చాన్స్‌ లేని వాళ్లు వేరే దారి చూసుకుంటున్నారని మరికొంత మంది విశ్లేషిస్తున్నారు. వైసీపీలో నిన్నటివరకు జగన్‌ మాటే మా మాట..ఆయన బాటే మాకు బాట అంటూ చెప్పుకొచ్చిన నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరిగా నిరసన గళమెత్తుతున్నారు. ఇవాళ ఆనం, నిన్న రాచమల్లు, మొన్న కోటంరెడ్డి ఇలా  రోజుకొకరు జగన్‌ పాలనపై అసహనం వ్యక్తం చేయడంతో  అధికార పార్టీలో చర్చకు తావిస్తోంది. నెల్లూరు జిల్లా వైసీపీలో సఖ్యత లేదు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఇదే తీరు. ఆనం, అనిల్‌ యాదవ్‌, కోటంరెడ్డి, కాకాణి ఇలా చెప్పుకుంటే జిల్లా వైసీపీ నేతలందంతా ఎవరి దారి వారిదే. ఎవరి తీరు వారిదే అన్నట్లు ఉంటుంది. బలనిరూపణ కోసం కొందరు, జగన్‌ చూపు పడాలని మరికొందరు ఎవరికి తోచిన విధంగా వారు జిల్లాలో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భేదాభిప్రాయాలు మరింత ఎక్కువై రోడ్డునపడుతున్నారు. ఈ విషయంగా పలుమార్లు జగన్‌ జిల్లా నేతలకు నచ్చచెప్పినా ఫలితం మాత్రం అంతంత మాత్రమేనన్న టాక్‌ ఉంది. ఈ క్రమంలోనే మరోసారి సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు ఆనం రామనారాయణ రెడ్డి.

ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చేలా ఆనం మాట్లాడిన తీరు మరోసారి ఆ పార్టీలో కలకలం రేపుతోంది.  గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతోనే సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.  ఇప్పుడు మరోసారి తన నోటితీరుతో వార్తల్లో నిలిచారు. ఆనం మాత్రమే కాదు ఆ జిల్లా నేతల్లో ఒకరైన కోటం రెడ్డిది కూడా ఇదే తీరు. ప్రభుత్వ పథకాలు, అధికారుల తీరుపై ఎప్పుడూ ఆయన చిర్రుబుర్రులాడుతూనే ఉంటారు. ప్రస్తుతం పెన్షన్ల కోతపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న జగన్‌ ప్రభుత్వానికి కోటం రెడ్డి రూపంలోనూ వ్యతిరేకత ఎదురువుతోంది. ఎట్టిపరిస్ధితుల్లోనూ పింఛన్లు కోత ఉండకూడదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ కూడా చేస్తున్నారు. టిడిపి అధినేతతో పాటు జనసేన అధినేత కూడా పింఛన్ల కోతని తప్పుబడుతూ జగన్‌కు లేఖ రాయడంతో ప్రస్తుతం ఏపీలో పించన్ల ఫైటింగ్‌లో విపక్షాలకు బలమైన ఆయుధం దొరికినట్లయింది.  ఇక నల్లపురెడ్డి కూడా మొన్నటివరకు జగన్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చినా ఇప్పుడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా కనిపించడంతో ఆ వార్తలకు చెక్‌ పడినట్లయింది.  

నవరత్నాల పథకాలు అన్నీ సీయం బటన్‌ నొక్కితే అవుతున్నాయి. క్రెడిట్‌ ఆయనకే వెళుతోంది. మళ్లీ పార్టీ గెలవాలంటే ఎమ్మెల్యేలకు కూడా క్రెడిట్‌ రావాలి కదా అంటూ దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల చేసిన కామెంట్స్‌ కూడా గతంలో హాట్‌ టాపిక్‌గా మారాయి.  జగన్‌ సొంత జిల్లా కడపలోనూ ఇదే తీరు కనిపిస్తోంది. ప్రొద్దూటురు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ కూడా టీచర్లు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని చెప్పడంతో ఆ పార్టీలో కల్లోలం మొదలైంది. నిన్నగాక మొన్న జరిగిన సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతు సంఘం గెలవడంతో పాటు ఉద్యోగుల వ్యతిరేకత జగన్‌ పాలనపై లేదన్న తీర్పునిచ్చిందని వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఈ తరహా విమర్శలకు దిగుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు సీనియర్‌ నేతలు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా ఉండే నేతలకే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తానని జగన్‌ చెప్పడం వల్లే  నిరాశలో ఉన్న నేతలు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు కొందరు అంటున్నారు.అసమ్మతిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల అసమ్మతి ఉందని, ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి నియోజకర్గంతోపాటు తనకు కూడా అసమ్మతి ఉందని అన్నారు. మొన్నా మధ్య అనంతపురంలోని ఓ ఫంక్షన్‌ హాలులో రాప్తాడు నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.  దానికి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అయిన పెద్దిరెడ్డి హాజరై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అసమ్మతిని పక్కనపెట్టి ప్రతి నాయకుడిని కలుపుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. మంత్రి పెద్ది రెడ్డి చెప్పినట్లు వైసీపీ నేతలు నడుచుకుంటారా? లేక అసమ్మతి గళాలు పెరుగుతూనే ఉంటాయా?