వైసీపీకి  దూరమయ్యాక తొలిసారి అసెంబ్లీకి  

వైసీపీకి  దూరమయ్యాక తొలిసారి అసెంబ్లీకి  

నెల్లూరు : అధికార పార్టీకి దూరం జరిగిన తరువాత మొదటిసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.  సోమవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, అభివృద్ధికి నోచుకోని పనులపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. మాచర్లలో సేకరించిన భూమి వ్యవహారంలో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల మధ్య సయోధ్య కుదరక పారిశ్రామిక వాడ మరుగున పడిందన్నారు. 
ముఖ్యమంత్రి, అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఉపయోగం లేకుండా పోయిందని కోటంరెడ్డి పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలో పనుల సాధన కోసం పోరాటాల దిశగా అడుగులేస్తున్నానన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు అసెంబ్లీలో శక్తి వంచనలు లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ పొట్టేపాలెం కలుజు పై వంతెనకు రూ.28 కోట్లు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. 31వ తేదీ లోపు స్పష్టమైన హామీ రావాలని.. ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 6న ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లలో కూర్చొని జలదీక్ష చేపడుతానన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు 9 గంటల పాటు జలదీక్ష చేపడుతానని కోటంరెడ్డి పేర్కొన్నారు.