రెండు హెలికాఫ్టర్లు ఢీ.. పది మంది సిబ్బంది మృతి

మలేసియా: మలేసియా (MALAYSIA) లో నేవల్ వేడుకల కోసం నిర్వహిస్తున్న రిహార్సల్స్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు హెలికాఫ్టర్లు (Helocopters) గాలిలో ఒకదానిని ఒకటి ఢీకొని, మొత్తం పది మంది సిబ్బంది దుర్మరణం చెందారు. రాయల్ మలేసియన్ నేవల్ వేడుకల కోసం పదుల సంఖ్యలో హెలికాఫ్టర్లతో విన్యాసాల వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో ప్రమాదవశాత్తూ రెండు హెలికాఫ్టర్ల రెక్కలు ఒకదానికొకటి తాకాయి. క్షణాల వ్యవధిలోనే రెండు హెలికాఫ్టర్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. లముట్ లోని రాయల్ మలేసియన్ నేవీ బేస్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ఎం503-3 మారిటైమ్ ఆపరేషన్స్ హెలికాఫ్టర్ లో ఏడుగురు సిబ్బంది వుండగా, మరొక ఎం502-6 హెలికాఫ్టర్లో ముగ్గురు సిబ్బంది వున్నట్టు సమాచారం. రానున్న మే నెల 3 నుంచి 5 వ తేదీల మధ్య జరగనున్న నేవీ డే వేడుకల సందర్భంగా ఈ హెలికాఫ్టర్లు రిహార్సల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.