కరోనా పుట్టింది చైనాలోని ల్యాబ్​ నుంచే

కరోనా పుట్టింది చైనాలోని ల్యాబ్​ నుంచే

ప్రపంచాన్ని వణికించిన కరోనా  వైరస్‌ జన్మస్థానం చైనాలో ఓ ల్యాబ్‌ నుంచే జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ కొత్తగా సేకరించిన నిఘా సమాచారం మేరకు ల్యాబ్‌ లీక్‌పై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో పేర్కొంది. ది ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నత స్థాయి నిపుణులు ఉండటంతో ఈ నివేదిక ప్రధాన్యం సంతరించుకొంది. అమెరికాలో జాతీయ పరిశోధనశాలలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంటుంది. వీటిల్లో కొన్ని అత్యున్నత స్థాయి జీవ పరిశోధనలు చేస్తున్నాయి.  గతంలో అమెరికాకు చెందిన వివిధ డిపార్ట్‌మెంట్లు కొవిడ్‌ పుట్టుకపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ కూడా గతంలో నిర్దిష్టంగా చెప్పలేకపోయింది. కానీ, తాజాగా ఇచ్చిన 5 పేజీల నివేదికతో ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ కూడా చైనా వైపే వేలెత్తి చూపింది. తన నెట్‌వర్క్‌లోని ల్యాబ్‌ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దీనిని తయారు చేసింది. గతంలో అమెరికా దర్యప్తు సంస్థ ఎఫ్‌బీఐ కూడా చైనాలోని ల్యాబ్‌ నుంచి ప్రమాదవశాత్తు వైరస్‌ లీకై ఉంటుందని అభిప్రాయపడింది. మరోవైపు అమెరికా కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లు కొవిడ్ పుట్టుకపై మరింత సమాచారం తెప్పించేందుకు బైడెన్‌ కార్యవర్గం మరిన్ని వనరులను మోహరించాలని కోరుతున్నారు. వాల్‌స్ట్రీట్‌ నివేదికపై స్పందించేందుకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులేవాన్‌ నిరాకరించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఇప్పటికే పలు ఇంటెలిజెన్స్‌ సంస్థలను కొవిడ్‌ పై వీలైనంత ఎక్కవ సమాచారం సేకరించాలని సూచించారన్నారు.