ప్రపంచం మెచ్చిన కళాయాత్రికుడు: లక్ష్మణ్​ ఏలె

ప్రపంచం మెచ్చిన కళాయాత్రికుడు: లక్ష్మణ్​ ఏలె
  • ఆయన కుంచె నుంచి జాలువారే చిత్రాలు.. గ్రామ జీవనానికి సజీవ సాక్ష్యాలు.. 
  • అమాయకత్వం, స్వచ్ఛతల కలయికే అసలైన అందం అని తెలిపే అపురూప చిత్రాలు.. 
  • గ్రామాలను చూసి ఆయన స్ఫూర్తి పొందారో.. 
  • లేక గ్రామంలోని పసినతపు పరిమళమే ఆయన చేతిలో ఒదిగిపోయిందో తెలియదు కానీ.. 
  • చూసే కళ్లకు మాత్రం గ్రామజీవనం.. పేపర్​పై కొలువు తీరిందా అనిపిస్తుంది..
  • అతనే లక్ష్మణ్​ ఏలె.. 
  • ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.. ఆయన చిత్రలేఖనం విశ్వవ్యాప్తమైంది.. 

ఊహలను రూపంగా మలచగల ఏకైక సాధనం చిత్రలేఖనం. ఏలె లక్ష్మణ్‌ చిత్రాలు చూస్తున్నపుడు కింద ఆయన సంతకం కోసం వెదకనవసరం లేదు. చిత్రంలోని ప్రతి రేఖలోనూ ఆయన దాగి ఉంటాడు. ఆ చిత్రాలలో స్వచ్ఛంగా, అమాయకంగా ఉన్న పల్లెటూరి అమ్మతనం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నీరెండలో స్నానం చేసిన పల్లెను సుతారంగా తన కుంచెతో స్పృశిస్తూ వారి దైనందిన జీవనాన్ని, ఆహ్లాదకరంగా మార్చి మన కళ్ల ముందుంచే కళాత్మకత ఆయన సొంతం. మచ్చుకైనా భేషజం లేని పల్లెటూరి జీవన స్రవంతి. సుతి మెత్తని పలకరింపుతో మనల్ని పరవశింపజేస్తుంది. ఆ చిత్రాలు అంత అందంగా కనిపించడానికి కారణం.

గోడలకు అలికే సున్నం, జాజు, ఎర్రమట్టి, ఎర్రటిబొట్లు, మట్టిరంగుల అందాలు.. ఇవే ఆ చిత్రాలకు సోయగాన్ని అందించి. మనల్నీ పులకింతకు గురిచేస్తాయి. ప్రతి చిత్రకారునికి ఒక ప్రత్యేకమైన అభిరుచి, వ్యక్తీకరణలు వుంటాయి. ఆయన చిత్రాల్లో తెలంగాణా పల్లెల్లోని దళిత, బహుజన ప్రపంచం కనిపిస్తుంది. అంతేకాదు.. ఆ రంగుల భాషలో, నల్లటి రేఖల్లో తెలంగాణ పల్లె ప్రజల అస్తిత్వాన్ని మనకు పరిచయం చేస్తాడు.. అందుకేనేమో వీటిలో లోతైన నిజం దాగి ఉంటుంది. మరో విషయం ఏమిటంటే.. లక్ష్మణ్​ చిత్రాలు అన్నీ చీకటి రంగులోనే ఉంటాయి కాబట్టి భావవ్యక్తీకరణను స్పష్టంగా చూడగలుగుతాం. ఇంతటి మహోన్నత చిత్రాలు గీసిన లక్ష్మణ్​బాల్యం లోకి తొంగి చూస్తే..

బాల్యం
లక్ష్మణ్​స్వస్థలం నల్గొండ జిల్లా కదిరేని గూడెం. ఆయన తండ్రి పేరు చంద్రయ్య.. మగ్గాన్ని నమ్ముకున్న వ్యక్తి. తల్లి పేరు వీరమ్మ.. లక్ష్మణ్​చిన్నప్పటి నుండీ చదువులో అత్తెసరు మార్కులే తెచ్చుకునేవాడు. ఒకరోజు గోడపై ఉన్న ఆయన నాయనమ్మ బొమ్మ చూసి అతనికి బొమ్మ గీయాలనిపించిందట. అలా నూనె రాసిన కాగితంపై అతని నాయనమ్మ చిత్రాన్ని ట్రేస్​చేసి మొదటి బొమ్మని గీసాడట.. తరువాత సైన్​ బోర్డులను చూసి తన గీతలను మెరుగుపెట్టున్నాడు. అలా అతని గీతలను చూసి కాలేజీలో అధ్యాపకులు కార్టూన్లు గీయటం నేర్చుకోమని ప్రోత్సహించారు. లక్ష్మణ్​కు ‘రాళ్ళు’ ఇష్టమైన సబ్జెక్టు. అతనికి తెలిసిన మనుషులూ, ప్రపంచమూ ఆ రాళ్ళలోకి ఒదిగిపోయి తమ బాధలూ, గాథలూ చెప్పుకున్నట్లుగా అనిపించేవట.. ఆ భావననే తన చిత్రాలలో ప్రవేశ పెట్టాడట. ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఎన్నో కష్టనష్టాలు ఉంటాయి అనేమాటకు సాక్షిగా.. లక్ష్మణ్​ కూడా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో బర్రెలు మేపేవాడు. అప్పుడు అక్కడి రాళ్లను చూసి మైమరిచిపోయేవాడు. అక్కడి రాళ్ళు వివిధ రకాల ఆకారాల్లో అతన్ని పలకరించేవి. అలా లక్ష్మణ్​ చిన్నతనమంతా కదిరేని గూడెం దాటిపోలేదు.   

'ముద్ర' తన సహజమైన చిత్రాల గురించి ఒకసారి లక్ష్మణ్ ని కదిలిస్తే.. 
‘నేను మా వూరిలో చూసిన మనుషులందరి నుంచి స్ట్రాంగ్‌ ఫీచర్స్‌ని గ్రహించాను. వాటిని నా చిత్రాల్లో వుండే మనుషుల్లోకి ప్రవేశపెట్టాను. నా చిత్రాల్లోని మహిళలకు ఏ అలంకారాలూ కనిపించవు. వారి బాధ మాత్రమే ముఖంపై వుంటుంది. పెయింటింగ్‌లోని సాంకేతిక అంశాల్ని నేను అసహ్యించుకుంటాను. ఈ కంజ్యూమర్‌ సొసైటీలో కొనుగోలు దారుణ్ణి భ్రమింపచేయడానికి మాత్రమే ఈ టెక్నిక్‌ అనేది పనికొస్తుంది. నాకు తెలియంది నేను చిత్రించలేను. గ్రామీణ జీవితమే నా ఇతివృత్తం. ఈ జీవితం తప్ప మిగతా ప్రపంచం నాకంత దగ్గరగా తెలీదు. నా బతుకే అది’ అని చెబుతారు..  రెండు దశాబ్దాలుగా నగరంలోనే జీవిస్తున్నా పల్లె అందాలు ఇంకా అతన్ని వెంటాడుతూనే వున్నాయి. పసితనం నాటి ఆ జ్ఞాపకాల ఊటలోనే అతనింకా ఈదులాడుతున్నాడు. అందుకే ఆ చిత్రాల్లో వసివాడని పసితనం, అమాయకత్వం కనిపిస్తుంది. 

బహుముఖ ప్రజ్ఞ

కేవలం గ్రామీణ ప్రాంతాల చిత్రాలు మాత్రమే ఆయన కుంచె నుండి జాలువారాయంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.. ఆయన చాలా సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్​గా, అనేక పత్రికలలో లే అవుట్​ ఆర్టిస్ట్​గా  పనిచేశాడు. లక్ష్మణ్‌లో చిత్రకళతోపాటు మంచి సాహిత్యాభిరుచి కూడా వుంది. గోసంగి కవుల కవిత్వం అన్నా, ఒక అనుభవాన్ని సృశించే ఇస్మాయిల్‌ హైకూలన్నా అతనికిష్టం. అసంఖ్యాకమైన కవితా సంకలనాలకూ, కథలకు ముఖచిత్రాలు వేశాడు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను, పోలీసు శాఖ లోగోని డిజైన్​ చేసింది కూడా లక్ష్మణే.. 1999లో మొదటిసారి రవీంద్రభారతిలో ‘ఇమేజెస్​ ఆఫ్​ కదిరేని గూడెం’ పేరుతో చిత్రకళా ప్రదర్శనకు చుట్టిన శ్రీకారం నేను ప్రపంచవ్యాప్తం అయ్యింది. జపాన్, ఐరోపాలతో పాటు ఇటీవలే న్యూయార్క్​లో కూడా వీరి చిత్రకళా ప్రదర్శన జరిగింది. త్వరలోనే కాలిఫోర్నియాలో మరో చిత్రకళా ప్రదర్శన జరగనుంది.. ఇలా లక్ష్మణ్.. తెలంగాణా చిత్రకళా ప్రాభవాన్ని అంతర్జాతీయం చేశాడు. 
– ఎస్. ఎన్​. ఉమామహేశ్వరి

అంతరంగ చిత్రాలు

మనసులో మెదిలే కలలకు, మెదడులో కలిగే ఆలోచనలకు కొంగొత్త వర్ణాలద్దుతోంది వర్ధమాన చిత్రకారిణి ప్రియాంక. కుంచెతో అద్భుతాలు సృష్టిస్తోన్న ఈ యువతి బాల్యం రంగుల మయం. తండ్రి చాటు చిన్నారిగా ఆయన వేసిన బొమ్మల్లో తన రూపాన్ని చూసుకుంది. ఇప్పుడు మనసులోని ఆలోచనలను కాన్వాస్‌పై అద్భుత చిత్రాలుగా ఆవిష్కృతం చేస్తూ..  తన ప్రతిభతో ప్రముఖలచేత ప్రశంసలు, మన్ననలు అందుకుంటుంది ఈ యువ చిత్రకారిణి. తెలంగాణ ప్రజల సంస్కృతిని, వారి జీవనాన్ని ప్రతిబింబించేలా తండ్రి లక్ష్మణ్​ వేసిన పెయింటింగ్ లను చూసి స్ఫూర్తి పొందిన ప్రియాంక..  కాంట్రాస్ట్ గా పర్యావరణం, జంతువులు, మొక్కలను.. ఇతివృత్తంగా తీసుకుంది. తొలినాళ్లలో ఆయిల్, పేస్టల్స్, పెన్ అండ్ ఇంక్‌తో ప్రయోగాలు చేసి, ఇప్పుడు యాక్రిలిక్స్‌తో అద్భుతాలు సృష్టిస్తుంది.  పల్లె సంస్కృతినీ, ప్రకృతి అందాలనూ చూపించేందుకు ఎలాంటి నిబంధనలు ఉండకూడదని తండ్రి చెప్పిన మాటలే ఆదర్శంగా తీసుకుంది ప్రియాంక. అయితే మనసులోని భావాలకు కుంచెతో దృశ్యరూపం ఇవ్వడం అంత సులభమేమీ కాదు. వాస్తవికత, భావుకతల మధ్య ఆహ్లాదకరమైన అనుభూతి ఉంటుంది. దీన్ని దృశ్యరూపంగా మలచడం ఎంతో క్లిష్టమైన పని.

 దాన్ని సవాల్‌గా తీసుకుని సక్సెస్​ఫుల్​గా ముందుకు సాగుతోంది ఈ కళాకారిణి. ఇదే విషయం ఆమెతో ప్రస్తావిస్తే.. 
‘ఊహ తెలిసిన నాటి నుంచే రంగుల మధ్య పెరిగాను. నాన్న ప్రోత్సాహంతో హైదరాబాద్ జేఎన్‌ఏఎఫ్‌యూలో ఆర్ట్స్‌లో డిగ్రీ, సెంట్రల్ వర్సిటీలో పీజీ పూర్తి చేశా. పెయింటింగ్‌తో పాటు థియేటర్ ఆర్ట్స్‌లో పీహెచ్​డీ అందుకున్నాను. ఈ క్రమంలోనే సురభి, యక్షగానం గురించి అధ్యయనం చేసి ఆ కళాకారుల సంస్కృతిపై దృష్టి పెట్టాను’ అని చెబుతుంది  -ప్రియాంక ఏలె. యాక్రిలిక్స్‌తో అందమైన చిత్రాలకు ప్రాణం పోయటం ప్రియాంకకు అలవాటు.

అలా ఇప్పటి వరకు దేశ విదేశాల్లో 8 సోలో, 150కి పైగా గ్రూప్ ప్రదర్శనలు ఇచ్చి ఔరా అనిపించుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫౌండేషన్ ద్వారా ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్‌లో ఆరు వారాల పాటు ఉండి చిత్రలేఖనం చేసింది. యూరోపియన్, భారత సంస్కృతికి దగ్గర ఉండేలా గీసిన బొమ్మలు అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలిండియా పెయింటింగ్ పోటీల్లో బంగారు పతకాన్ని అందుకుంది ప్రియాంక. తండ్రి కళకు వారసురాలిగా చిత్రలేఖనాన్ని ఎంచుకున్నా తనకంటూ ప్రత్యేక శైలిని అందిపుచ్చుకుని మెప్పిస్తోంది ప్రియాంక. ఇప్పుడు తన తండ్రితో పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చిత్రకళా ప్రదర్శనలో పాల్గొంటోంది.  

లక్ష్మణ్​ ఏలె కు  ఘన సన్మానం

ఈ నెల 13, 14 తేదీలలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాట) కన్వెన్షన్ 24 రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ న్యూ జెర్సీ లో జరిగిన కార్యక్రమం లో నిర్వాహకులు లక్ష్మణ్ ఎలేని ఘనంగా సన్మానించారు. ఆయనకు సంబంధిచిన 'ఏవీ' ని ప్రదర్శించారు.