ఆత్మగౌరవం కోసమే రాజీనామా..!
రామకృష్ణాపూర్,ముద్ర: చెన్నూరు నియోజవర్గ ప్రజల ఆత్మగౌరవం కోసమే తాము బీఆర్ఎస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు టి(బీ)ఆర్ఎస్వి స్టేట్ సెక్రటరీ ఎండి.ముజాహిద్, రామకృష్ణాపూర్ యూత్ ప్రెసిడెంట్ బింగి శివ కిరణ్ స్పష్టం చేశారు. ఆదివారం మందమర్రి లోని ఓ ఫంక్షన్ హల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 200 మంది యువతతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎండి.ముజాహిద్, బింగి శివ కిరణ్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ అహంకార వైఖరికి నిరసనగా తాము రాజీనామా చేశామన్నారు. ఈ ప్రాంత యువకుల భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు కేవలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో నెరవేరుతాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం వేలాదిమంది యువతతో కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వారితో పాటు మందమర్రి 17 వ వార్డు అధ్యక్షుడు పొలు నరేష్, రామకృష్ణాపూర్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎండి ఇందాస్,యువత ఉన్నారు.