కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా

ప్రపంచస్థాయి ఫార్మాస్యుటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ప్రాణాంతక కరోనా వైరస్ ను నిర్మూలించడానికి తయారు చేసిన వ్యాక్సిన్ ను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. ఈ వ్యాక్సిన్ ఇక ఎక్కడా కనిపించదు. దీని వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం కావడం, ఈ వ్యాక్సిన్ వినియోగించిన వారిలో గుండెపోటు, బ్లడ్ క్లాటింగ్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ వంటి దుష్పరిణామాల నేపథ్యంలో భారత్ లోని సుప్రీంకోర్టు సహా వివిధ దేశాలలోని న్యాయస్థానాలలో కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ విక్రయాలపై ఆస్ట్రాజెనెకా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన దిగ్గజ ఫార్మాస్యుటికల్ కంపెనీ ఆస్ట్రాజెననెకా. ఆక్స్ ఫర్డ్ సహకారంతో ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. కోవిడ్ ను నిర్మూలించడానికి భారతదేశం సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఈ వ్యాక్సిన్ ను వినియోగించారు. వ్యాక్స్ జెవ్రియా పేరుతో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ను భారత్ లో పుణేకు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో భారత్ లో పంపిణీ చేసింది. భారత దేశంలో సీరమ్ ఇన్ స్టిట్యూట్ 175 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను పంపిణీ చేసింది. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో తీవ్రమైన సైడ్ ఎఫెక్స్ట్ వస్తాయని గతంలో ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ఈ టీకా తీసుకున్న వారు అకాల మరణం చెందుతున్నారంటూ లండన్ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా ఈ విషయాలను అంగీకరించింది. లిఖిల పూర్వకంగా పలు డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. గుండెపోటు, బ్లడ్ క్లాట్ వంటి సమస్యలు రావొచ్చునని కంపెనీ అంగీకరించింది. కంపెనీనే స్వయంగా ఈ విషయం వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తగా ఆందోళనలు వ్యక్తమవడంతో పాటు, మన దేశంలోనూ కోర్టులో కేసులు నమోదయ్యాయి. భారత్ లోని సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది విశాల్ తివారీ కేసును ఫైల్ చేశారు. వ్యాక్సిన్ డ్యామేజ్ పేమెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్య నిపుణులు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా తమ వ్యాక్సిన్ ను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 5వ తేదీనే ఈ నిర్ణయాన్ని లండన్ హైకోర్టుకు వెల్లడించిన ఆ కంపెనీ, వ్యాక్సిన్ ఉపసంహరణ మే 7వ తేదీ నుంచి అమలులోకి వస్తందని పేర్కొంది.