రష్యా గ్యాస్‌ స్టేషన్‌లో పేలుడు : 35 మంది మృతి 115 మందికి గాయాలు

రష్యా గ్యాస్‌ స్టేషన్‌లో పేలుడు : 35 మంది మృతి  115 మందికి గాయాలు

మాస్కో : రష్యాకు చెందిన దక్షిణ రిపబ్లిక్‌ డాగెస్టాన్‌లో గ్యాస్‌ స్టేషన్‌ పేలిన దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 35 మంది మరణించారు. మరో 115 మంది గాయపడ్డారు. వారిలో 16 మంది చిన్న వయసు వారు సహా 65 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరు పిల్లలు, 12 మంది పౌరుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. మఖచ్కల నగర శివారులో సోమవారం రాత్రి ఈ పేలుడు చోటుచేసుకుంది.

ముందుగా ఓ కార్ల మరమ్మతు దుకాణంలో చెలరేగిన మంటలు విస్తరించి సమీపంలోని గ్యాస్‌ స్టేషన్‌ను చుట్టుముట్టాయి. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. మృతుల కుటుంబాలకు 10 వేల డాలర్ల చొప్పున, గాయపడిన వారికి రెండు వేల నుంచి నాలుగు వేల డాలర్ల చొప్పున నష్ట పరిహారం ప్రకటించినట్లు డాగెస్టాన్‌ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో కొంతమందిని చికిత్స కోసం వాయు మార్గంలో మాస్కోకు తరలించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సంఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. డాగెస్టాన్‌లో మంగళవారం సంతాపదినంగా పాటించారు. మరోపక్క పశ్చిమ సైబీరియాలోని ఖాంటి-మాన్సిక్‌ ప్రాంతంలోని చమురు క్షేత్రంలో  సంభవించిన పేలుడుతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.