ప్రపంచ గమనం.. వికసించిన విశ్వ మానవత | Mudra News

ప్రపంచ గమనం.. వికసించిన విశ్వ మానవత | Mudra News

గత వారం టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో దాదాపు 25 వేల మంది మరణించారు. ఇది అంచనా మాత్రమే. దాదాపు కోటిన్నర మంది నివాసముండే పరిసరాలలో సంభవించిన ఈ భూకంప విలయాన్ని 7.6 రిక్టర్ స్కేలు తీవ్రతగా గుర్తించారు. ఈ భూకంపం వల్ల భారీగా జన నష్టం జరగడమే కాకుండా, లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు. దాదాపు కోటి మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఆపదను చూసిన ప్రపంచ దేశాలు సిరియా, టర్కీపై తమకున్న అభిప్రాయాలను పక్కనపెట్టి సహాయానికి ముందుకు రావడం విశ్వ మానవతను, దయాగుణాన్ని చాటుతున్నది. మానవులదంతా ఒకటే కుటుంబం అని, ప్రపంచమంతా ఒకటేనని భారత ప్రధాని మోడీ వ్యాఖ్యానించినట్టుగా ఈ ఆపదలో టర్కీ సిరియాను ఆదుకోవడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు ముందుకు కదిలాయి. వీరిలో అందరి కంటే ముందు భారతదేశం స్పందించింది. భూకంపం సంభవించిన మరునాడే భారతదేశ నుంచి సహాయక సామాగ్రితో నాలుగు విమానాలు టర్కీ చేరుకున్నాయి. ఆ మరునాడు మరో రెండు విమానాలు సామాగ్రి తో సిరియా చేరుకున్నాయి. దేశం పంపిన సామగ్రిలో ఒక ఆసుపత్రికి కావాల్సిన అన్ని రకాల పరికరాలు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దాదాపు 200 మంది ఎన్టీఆర్ బృందాలు తరలివెళ్లాయి. ఇక అమెరికా కూడా సిరియా, టర్కీకి 85 మిలియన్ డాలర్ల భారీ సహాయాన్ని ప్రకటించింది. ఒకరకంగా సిరియా, టర్కీ ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నాయి.

ఆంక్షలను పక్కకు నెట్టి 
సిరియాలో దాదాపు పది సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతూ కొంత ప్రాంతం ఉగ్రవాద చేతులకు వెళ్లిపోయింది. ఈ కారణంగా అమెరికా సిరియాపై కొన్ని ఆంక్షలను విధించింది. అయితే, తాము ప్రకటించిన విరాళాన్ని సద్వినియోగం చేయడానికి, అక్కడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సహాయక చర్యలు కొనసాగించడానికి అమెరికా సదరు ఆంక్షలను ఆరు నెలల పాటు సడలించినట్టు తెలిసింది.
అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ , యూరోపియన్ యూనియన్ దేశాలు సహా దాదాపు 60 కి పైగా దేశాలు భూకంప బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చాయంటే అన్ని దేశాలను ఎంతో అభినందించక తప్పదు. చివరకు తాలిబన్ పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ కూడా దాదాపు 15 మిలియన్ ఆఫ్ఘానీలను టర్కీ, సిరియాకు సహాయంగా ప్రకటించింది. ఆయా దేశాలు, ఐక్యరాజ్యసమితి బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి. ఆయా దేశాలు ప్రకటించిన సహాయంలో శకలాల తొలగింపు పరికరాలు, బుల్డోజర్లు ఎక్స్ కవేటర్లు, మ్యాన్ పవర్, మందులు, ఆహారం, వస్త్రాలు దుప్పట్లు, బ్లాంకెట్లు, మంచినీరు ఇంకా ఇతర సామగ్రి ఉన్నాయి. అజర్ బైజాన్ అయితే తమ దేశంలోని బాకు నగరంలో దవాఖానాలను ఏకంగా భూకంప బాధితుల కోసం కేటాయించింది. వారు ఇక్కడికి వచ్చి వైద్య సహాయం తీసుకోవచ్చునని ప్రకటించింది.

 ఆక్రందనలు, రోదనలు
ఈ రకంగా ప్రపంచ దేశాలన్నీ భూకంప బాధితులకు సహాయాన్ని అందిస్తున్నాయి. ఈ సహాయానికి స్పందించిన టర్కీ, సిరియా ప్రభుత్వ అధినేతలు ఆయా దేశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా టర్కీ నాటో కూటమిలో సభ్యత్వం కోసం అప్లికేషన్ పెట్టుకున్నందున, ఉగ్రవాదం కారణంగా ఫిన్లాండ్ దేశాలు టర్కీ పట్ల వ్యతిరేకతతో దూరంగా ఉన్నాయి. అయితే భూకంప పీడితులకు సహాయం చేయడంలో ఈ కారణాలేవి ముందుకు రావడం లేదు. మహత్తర విలయం సంభవించి వేలాది మంది హతమయ్యారు. క్షతగాత్రుల ఆక్రందనలు, రోదనలు మాత్రమే ప్రపంచానికి కనిపించాయి. అందువల్ల ఆయా దేశాలు తమ తమ అభిప్రాయాలను, రిజర్వేషన్లను పక్కనపెట్టి ఆపద తమకే వచ్చినట్టుగా భావించి ఇక్కడ సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి. ఐక్యరాజ్యసమితికి సంబంధించిన రెడ్ క్రాస్ బృందాలు, ఆయా దేశాల రెడ్ క్రాస్ బృందాలు సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి. ఈ వ్యాసం రాసే సమయానికి ఇంకా శవాలు తీస్తూనే ఉన్నారు. వందలాదిమంది క్షతగాత్రులు ప్రాణాలతో బయటపడుతున్నారు. నిరాశ్రయులైనవారికి ఆ ప్రాంతంలో తీవ్రంగా చలి ఉండటం వల్ల షెల్టర్ కల్పించడం పెద్ద కష్టంగా కనిపిస్తున్నది. అయినా సహాయక బృందాలు, భద్రతా బలగాలు ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నాయి. ఈ భూకంపం వల్ల పంచ దేశాలన్నీ ఒకటేనని పరిస్థితి చెప్పకనే చెబుతున్నది.