జిల్లాలో డీపీఎల్‌ ఆపరేషన్లకు బ్రేక్‌

జిల్లాలో డీపీఎల్‌ ఆపరేషన్లకు బ్రేక్‌
  • ఇబ్రహీంపట్నం ఘటనతో నిలిపివేత
  • ప్రస్తుతం ట్యూబెక్టమీ, వేసక్టమీ ఆపరేషన్లే దిక్కు
  • కు.ని ఆపరేషన్లకు ప్రైవేట్‌ వైపు మొగ్గు
  • వేసక్టమీకి దూరంగా ఉంటున్న పురుషులు

ముద్ర,రంగారెడ్డి ప్రతినిధి: జిల్లాలో  కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు బ్రేక్‌ పడింది. ఏడాదిన్నరగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు బ్రేక్ పడడంతో ప్రైవేట్ ఆస్పత్రులలో కాసుల పంటగా మారింది. ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతిచెందిన సంఘటన తర్వాత క్యాంపుల నిర్వహణను గత ప్రభుత్వం నిలిపివేసింది. ప్రభుత్వం మారినా ఇప్పటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో చాలామంది మహిళలు కు.ని. ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని ఆపరేషన్లు మొదలు పెట్టాలని మహిళలు కోరుతున్నారు.

జిల్లాలో డబుల్‌ పంక్చర్‌ ల్యాప్రోస్కోపిక్‌ (డీపీఎల్‌) ఆపరేషన్‌ క్యాంపులను గత ప్రభుత్వం నిలిపివేసింది. ఇబ్రహీంపట్నంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2022 ఆగస్టు 25వ తేదిన 34 మందికి డీపీఎల్‌ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా, వారిలో నలుగురు (మమత, సుష్మ, మౌనిక, లావణ్య) చనిపోయారు. మిగతావారిని వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంది. ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ జోయల్‌ సునీల్‌కుమార్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా అప్పటి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్ ఝాన్సీపై బదిలీ వేటు విధించింది. వీరితో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. బాధ్యులపై చర్యలతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే అప్పటి నుండి డీపీఎల్‌ ఆపరేషన్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి ప్రభుత్వం డీపీఎల్‌పై ఉసెత్తలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పటికైనా డీపీఎల్‌ ఆపరేషన్లపై నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

అవగాహన అవసరం

ఇబ్రహీంపట్నంలో వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు మృతి చెందిన ఘటన తర్వాత మహిళలు కు.ని. ఆపరేషన్‌ అంటేనే జంకుతున్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. గతంలో ట్యూబెక్టమీ ఆపరేషన్లు ఎక్కువగా జరిగేవి. డబుల్‌ పంక్చర్‌ ల్యాప్రోస్కోపిక్‌ (డీపీఎల్‌) ఆపరేషన్లు చేయడం మొదలైనప్పటి నుంచి మహిళలు ఈ ఆపరేషన్లనే చేయించుకుంటున్నారు. అయితే చాలా మంది కు.ని ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ట్యూబెక్టమీ ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు. ట్యూబెక్టమీ ఆపరేషన్‌ చేసుకుంటే ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే మరో 15 రోజుల పాటు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. డబుల్‌ పంక్చర్‌ ల్యాప్రోస్కోపిక్‌ ఆపరేషన్‌ అయితే.. కేవలం మూడు, నాలుగు గంటల తర్వాత డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

డీపీఎల్‌ క్యాంపులకు బ్రేక్‌

2022 ఆగస్టులో జరిగిన ఘటనతో డీపీఎల్‌ క్యాంపులకు బ్రేక్‌ పడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతీనెల 80 నుంచి 145 వరకు డీపీఎల్‌ క్యాంపుల ద్వారా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసుకునేవారు. కానీ.. ఇబ్రహీంపట్నం ఘటనతో డీపీఎల్‌ క్యాంపులను తాత్కాలికంగా బ్రేక్‌ విధించారు. ఇప్పటికీ ఏడాదిన్నర పైగా కు.ని ఆపరేషన్లు నిలిచిపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు క్యాంపులు నిర్వహిస్తుండా అని మహిళలు ఎదురు చూస్తున్నారు.

ప్రైవేట్‌ వైపు మొగ్గు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ప్రైవేట్‌ ఆసుపత్రుల వైపు మహిళలు మొగ్గు చూపుతున్నారు.  ప్రభుత్వం వైద్యంపై నమ్మకం లేకపోవడంతో చాలావరకు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుండడంతో అక్కడికి వెళ్లేందుకు మహిళలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించక తప్పడం లేదని వాపోతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫీజును అమాంతం పెంచేశాయి. అదునాతన పద్ధతులు రావడంతో చాలామంది మహిళలు వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. 

వేసక్టమీకి దూరంగా పురుషులు

వేసక్టమీ.. ఈ పేరు వినగానే పురుషులు దూరంగా పరుగులు తీస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల్లో భాగంగా చేసుకోవాల్సిన ఈ ఆపరేషన్‌లకు వెనుకంజ వేస్తున్నారు. కేవలం అపోహలే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసక్టమీ గణాంకాలను పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతుంది. వేసక్టమీకి తాము దూరమంటూ.. భారం, బాధ్యతంతా ఇల్లాలిదే అన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. దీంతో ఒకరిద్దరు పిల్లల్ని కనగానే ఆడవాళ్లకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించేస్తున్నారు. 

ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ రాగానే ప్రారంభిస్తాం - డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి

ఏడాదిన్నర కాలంగా డీపీఎల్‌ క్యాంపులు నిర్వహించడం లేదు. ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్‌ రాగానే జిల్లాలో డీపీఎల్‌ క్యాంపులను నిర్వహించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లను ప్రారంభిస్తాం. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్యూబెక్టమీ, వేసక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు.