పట్నంలో గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతం

పట్నంలో గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతం
  • నిమిషం ఆలస్యం.. కంటతడి పెట్టిన అభ్యర్థులు
  • సాగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇబ్రహీంపట్నంలోని పలు పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరిగింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ సమీపంలో ఉన్న సెయింట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కళాశాల, మంగళ్ పల్లి సమీపంలోని శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్1 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

నిమిషం ఆలస్యం.. కంటతడి పెట్టిన అభ్యర్థులు

ఇబ్రహీంపట్నం పరిసరాల్లో ఏర్పాటు చేసిన గ్రూప్-1 పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఆలస్యంగా వెళ్లారు. నిమిషం నిబంధన ఉండడంతో సిబ్బంది లోపలికి అనుమతించలేదు. నిర్దేశించిన సమయానికి మించి నిమిషం ఆలస్యంగా వచ్చే వారికి ప్రవేశానికి అనుమతి ఉండదని అధికారులు ముందుగానే సూచించారు. అయినా కొంతమంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకోగా పరీక్ష రాసేందుకు నిరాకరించారు. నెలల తరబడి ప్రిపేర్ అయ్యామని, ట్రాఫిక్ కారణంగా ఆలస్యంగా వచ్చామని, తమను లోపలికి అనుమతించాలని ఏడుస్తూ కోరారు. దీంతో సుమారు 15 మంది వరకు ఆయా కేంద్రాల్లో పరీక్ష రాయకుండా ఏడుస్తూ వెనుదిరిగారు.

సాగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

గ్రూప్ 1 పరీక్ష నిర్వహణతో సాగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు కాలేజీ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో వాహనాలు నిదానంగా కదలడంతో రెండు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరీక్ష అనంతరం కూడా సాగర్ రహదారిపై ఒక్కసారిగా అభ్యర్థులు రావడంతో పబ్లిక్, ప్రైవేటు వాహనాలతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇబ్రహీంపట్నం పోలీసులు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.