గిరిజన తండాలపై ఎక్సైజ్ దాడులు సరికాదు

గిరిజన తండాలపై ఎక్సైజ్ దాడులు సరికాదు
  • గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించాలి
  • ఇంటి తాలాలు పగులగొట్టి దాడులు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు
  • తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల్య నాయక్

ముద్ర,పానుగల్: గుడుంబా తయారు చేస్తున్నారని తాండాలలో గిరిజన కుటుంబాలను వేధించడం సరికాదని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల్య నాయక్ అన్నారు. శుక్రవారం పానుగల్ మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి తండాలో ఎక్సైజ్ అధికారులు గుడుంబా తయారు చేస్తున్నారని గిరిజన కుటుంబాల ఇళ్లలో దాడులు నిర్వహించారని,ఇంటికి తాళాలు ఉన్న పగలగొట్టి దాడులు చెయ్యడం సరికాదు అన్నారు. తండాలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు కుమారులు వలస వెళ్లడంతో ఇండ్ల దగ్గరనే ఉంటున్న వృద్ధులు తాగడానికి ఒక సీసా పెట్టి తాగుతున్నారు తప్ప అమ్ముకోవడానికి కాదన్నారు.

గిరిజన తండాలలో చాలా వరకు గిరిజన కుటుంబాలు సారా తయారీని మానుకున్నారని అన్నారు.వికలాంగుడు అయిన భాష నాయక్ ఇంటికి వెల్లి యజమాని అనుమతి లేకుండానే ఇంటి తాళాలను పగలగొట్టి ఇంట్లో వున్న వస్తువులను చిందర వందర చేశారని ఆయన అన్నారు.ప్రభుత్వం ఎస్టీ కార్పొరేషన్ నుండి రుణాలు అందిస్తామని తెలిపినప్పటికి అధికారులు ఎలాంటి ఉపాధి చూపలేదన్నారు. గిరిజనులపై ఎక్సైజ్ శాఖ అధికారులు  దాడులు నిర్వహించడం   సరైన విధానం కాదని ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్ద గిరిజన తండా అయిన తెల్లరాళ్లపల్లి తండాలో 70 శాతం గిరిజనులు బ్రతుకుతెరువు లేక వలస వెళ్లారని,ఏ ఇంటికి వెళ్ళిన ఇంటికి తాళాలు ఉంటాయని ఆయన అన్నారు. గిరిజన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే సంపూర్ణంగా సారా తయారిని అరికట్టవచ్చు అని అన్నారు.