మావోయిస్టు లుఅరెస్ట్

మావోయిస్టు లుఅరెస్ట్

రివాల్వర్, విప్లవ సాహిత్యం స్వాధీనం: జిల్లా ఎస్పీ వినీత్ జి

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వినీత్ జి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు. చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా చర్ల బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో నిషేధిత మావోయిస్టు పార్టీ చెందిన ఇద్దరు అజ్ఞాత దళసభ్యులను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేస్తున్న భద్రాద్రి జిల్లా, అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామానికి చెందిన తోట సీతారామయ్య అలియాస్ కృష్ణ తోపాటు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన పాదం రాజ్ కుమార్ అలియాస్ అమరేందర్ అనే దళ సభ్యులు హైదరాబాద్ వెళ్లేందుకు వచ్చి చర్ల బస్టాండ్ వద్ద పోలీసులు చిక్కారన్నారు. 

వీరు కేంద్ర కమిటీ నాయకత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్ వెళ్లి రహస్యంగా పార్టీ సానుభూతిపరులను ప్రజాసంఘాల సభ్యులను కలుస్తూ సిపిఐ మావోయిస్టు పార్టీ సాహిత్యం ద్వారా వారిని ఉత్తేజపరుస్తూ మావోయిస్టు పార్టీని ప్రజలకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అరెస్టు కాబడిన సీతారామయ్య 1982 నుండి అజ్ఞాత దళంలో పనిచేస్తూ పలు హింస కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. రాజ్ కుమార్ 2019 లో మావోయిస్టులో చేరి చర్ల మండలం కు చెందిన మాజీ ఎంపీటీసీ హత్యకేసుతోపాటు పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో ఉన్నారన్నారు. వీరి వద్ద నుండి విప్లవ సాహిత్యం, 3,40,000 నగదు, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో భద్రాచలం ఎస్పి పరతోష్ పంకజ్, ఓ ఎస్ డి సాయి మనోహర్, చర్ల సిఐ అశోక్  తదితరులు పాల్గొన్నారు.