23 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత..
జోగులాంబ గద్వాల, ముద్ర ప్రతినిధి: జిల్లాలో శుక్రవారం టాస్క్ ఫోర్స్ బృందాలు దాడులు చేసి దాదాపుగా 23 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్నారు. ప్రముఖ కంపెనీకి చెందినవిగా భావిస్తున్న ఈ విత్తనాలను ధరూర్, మల్దకల్ మండలాలకు చెందిన ముగ్గురు రైతుల ఇండ్లలో నిలువ ఉంచారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఈ రెండు మండలాలలో దాడులు చేసి 23 క్వింటాళ్లకు పైగా నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది అని అంచనా కాగా ఈ విత్తనాలు రైతులకు సంబంధించినవి కావు అని ప్రముఖ కంపెనీకి చెందిన విత్తనాలుగా అనుమానిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించవలసి ఉంది. దేశంలోనే పత్తి విత్తనాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన జోగులాంబ గద్వాల జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు దొరకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని ప్రతిరోజు పోలీస్, వ్యవసాయ తదితర శాఖల అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా. అది కేవలం బయట వినడానికి మాత్రమే కనిపిస్తుంది తప్ప. అక్రమార్కుల అడ్డదారులను ఏమాత్రం నిలువరించలేకపోతున్నాయని ఈ సంఘటన నిరూపిస్తోంది.