మానుకోట  వ్యవసాయమార్కెట్  ఐదు రోజులు నడపాలి..

మానుకోట  వ్యవసాయమార్కెట్  ఐదు రోజులు నడపాలి..
  • మార్కెట్ ముందు రైతుల ధర్నా

ముద్రప్రతినిధి, మహబూబాబాద్:-మహబూబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ను వారంలో మూడురోజులపాటు కాకుండా, ఐదు రోజులపాటు క్రమం తప్పకుండా నడపాలని డిమాండ్ చేస్తూ రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట సోమవారం దర్నా నిర్వహించారు. మార్కెట్ లో  మంచినీరు, సబ్సిడీభోజనం, వేసవికాలం కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు.

అనంతరం మార్కెట్ కార్యదర్శి కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు గునిగంటి రాజన్న, నల్లపు సుధాకర్ లు మాట్లాడుతూ రబీసీజన్ ప్రారంభమైన సందర్భంగా మార్కెట్ కు వరి, అపరాలు ఇతర వ్యవసాయ దినుసులు పెద్దమొత్తంలో వస్తున్నాయని, ఈ సమయంలో మార్కెట్ ను వారానికి మూడు రోజులే నడుపుతామని అధికారులు ప్రకటన చేయడం సబబు కాదని  అన్నారు. మార్కెట్ ను రెగ్యులర్ గా‌, నడిపి రైతుల యొక్క సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు.

ఈ సీజన్లో మూడు రోజులు మార్కెట్ నడపడం ద్వారా వ్యాపారులకు, చిల్లర కంట వారికి సహకరించినట్లు అవుతుందని  అన్నారు.   విపరీతంగా ఎండలు కొడుతున్న ఈ సమయంలో మార్కెట్ లో మంచినీరు కోసం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రభుత్వం  ఐదు రూపాయల సబ్సిడీ భోజనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను తక్షణం అధికారులు పరిష్కరించాలని, లేనట్లయితే రాబోయే కాలంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు  పాల్గొన్నారు.