ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ దగా చేసింది..!!
- మళ్ళీ ఓటువేస్తే మనను ఆగం చేస్తరు..
- ప్రధాని మోడీ గోదావరి తీసుకపోతానంటడు..
- ముఖ్యమంత్రి నోరు ముడేసుకుంటడు..
- ఉచితబస్సు తప్ప ఒక్క హామీ నెరవేర్చలేదు..
- మహబూబాబాద్ జిల్లా ఉండాలంటే మాలోత్ కవిత గెలవాలే..
- మానుకోట సభలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్..
ముద్రప్రతినిధి, మహబూబాబాద్: అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ దగాచేసిందని, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం హామీ తప్ప, ఏ..ఒక్క హామీని ఈ..ప్రభుత్వం నెరవేర్చలేదని టిఆర్ఎస్అధినేత, మాజీముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుదవారం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఎన్నికల కమిషన్ తనపై 48 గంటల ప్రచారనిషేధం విధించిందని, ఒక్క కేసీఆర్ 48 గంటలు ప్రచారంలో లేకుంటే, లక్షలాదిమంది బిఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా ఇంటింటి తలుపు తట్టి ప్రచారం చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ఉద్దేశించి పేగులు మెడల వేసుకుంటా, కండ్లగుండ్లు పీకుతా అంటూ ఇష్టానికి మాట్లాడుతున్న ఆయనపై ఎన్నికల కమిషన్ ఎందుకు నిషేధం విధించలేదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ రైతుఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని, కరీంనగర్ జిల్లాలో ఒక రైతు ఒడ్లు ఎండబెడుతూ ఆవేదనతో గుండె ఆగి మరణించాడని కేసిఆర్ ఆవేదన వ్యక్తం చేసారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము తప్పుపట్టడం లేదని, కానీ వీధిన పడ్డ ఆటోకార్మికుల జీవితాల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ఆటోకార్మికుల పక్షాన బిఆర్ఎస్ పోరాటం చేస్తుందని ప్రకటించారు. రైతుబంధు వచ్చిందా, 2500 రూపాయలు ఖాతాల్లో పడ్డాయా, తులం బంగారం వచ్చిందా..!!, రైతులకు ఏదువందల రూపాయల బోనస్ వచ్చిందా, రైతుకూలీలకు 1200రూపాయలు వచ్చాయా అంటూ ప్రజలను కేసీఆర్ అడిగారు. మహబూబాబాద్ ప్రాంతానికి నీరు కూడా రావడంలేదని ఇవేవీ ఇవ్వకుండా మళ్లీ ఓటు వేస్తే మరింత మోసపోతామని ఆయన అన్నారు. మహబూబాబాద్ గిరిజన ప్రాంతమని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తాను మహబూబాబాద్ జిల్లాను చేశానని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాను తీసేస్తానని అంటున్నాడన్నారు. మహబూబాబాద్ జిల్లా ఉండాలంటే ఎంపీగా మాలోత్ కవితని గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ ప్రాంతానికి నీటి కరువు ఉండేదని ఎస్సారెస్పీ ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. కానీ ఈ నాలుగు నెలల లోనే ఏమొచ్చింది ఎందుకు నీరు రావడంలేదని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఏ ఒక్కరికైనా వచ్చాయా అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు. గోదావరి నదిని ప్రధాని మోడీ ఎత్తుకపోతా అంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు ముడేసుకొని కూర్చున్నాడని విమర్శించారు ఇప్పటికే కృష్ణా నదిని కేఆర్ఎంబికి అప్పజెప్పారు. మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట నియోజకవర్గాల్లో మంచినీటి కరువు వచ్చింది, ఖమ్మంలో మురికినీరు వస్తుంది. డెబ్బైఏళ్ళ కాంగ్రెస్ పాలనలో గిరిజనులను గౌరవించలే.., కానీ బిఆర్ఎస్ పాలనలో బంజారాభవన్ సేవాలాల్ మహరాజ్ భవనం హైదరాబాద్ లో కట్టుకున్నాం.., గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్ పెట్టుకున్నాం, గిరిజనతండాలను గ్రామపంచాయతీలు చేసుకున్నాం కాబట్టి నేను గిరిజనబిడ్డలను కోరుతున్నా.. మీ ప్రతాపం ఈ..పార్లమెంట్ ఎన్నికల్లో చూపించాలని కేసీఆర్ కోరారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరంతా ఏకమై ఆలోచనతో పనిచేయాలి, బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్ల ఉండే, కాంగ్రెస్ వచ్చినంక ఈ..ఐదునెలల్లోనే ఎట్లయిపోయిందని ఆలోచించాలి. నా..ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగనివ్వనని కేసీఆర్ అన్నారు. కవిత మచ్చలేని మనిషి, బ్రహ్మండమైన నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలిగా ఐదేళ్లు బ్రహ్మండంగా పనిచేసింది. మళ్ళీ మీరంతా కవితను గెలిపించి యంపిగా అవకాశం ఇస్తే తెలంగాణ హక్కులు కాపాడడానికి మీ సేవకురాలిగా పనిచేస్తుందని కేసీఆర్ అన్నారు. ఈ..కార్నర్ మీటింగ్ లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, సుదర్శన్ రెడ్డి, హరిప్రియ, జెడ్పీ చైర్ పర్సన్ బిందు తదితరులు పాల్గొన్నారు.