దిశ ఎన్‌కౌంటర్‌ ఘటనలో పోలీసులకు భారీ ఊరట...హైకోర్టు సంచలన తీర్పు

దిశ ఎన్‌కౌంటర్‌ ఘటనలో పోలీసులకు భారీ ఊరట...హైకోర్టు సంచలన తీర్పు

ముద్ర,తెలంగాణ:- 2019లో హైదరాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో పోలీసులకు తాజాగా భారీ ఊరట లభించింది. సిర్పూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టును ఏడుగురు పోలీసు అధికారులు, షాద్ నగర్ తహసిల్దార్ ఆశ్రయించారు. వీళ్ళపై చర్యలు తీసుకోవద్దంటూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి స్టే విధించారు.

దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కోసం సిర్పూర్ కమిషన్ ను సుప్రీంకోర్టు నియమించింది. క్షేత్రస్థాయిలో పర్యటించడంతోపాటు పలువురిని సిర్పూర్ కమిషన్ విచారణ చేసింది. దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిర్పూర్ కమిషన్ సూచించింది. అయితే, సిర్పూర్ కమిషన్ నివేదిక సరిగ్గా లేదని హైకోర్టులో పోలీసు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా హైకోర్టు పోలీసులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.