లంచాలు అడగను... మిమ్మల్ని వదలను
- అధికారుల తీరు మారాలి
- ఎమ్మెల్య శ్రీహరి ఆగ్రహం
ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: నేను లంచాలు అడగను.. జవాబుదారితనం లేకుంటే మిమ్మల్ని వదలనని, క్షేత్రస్థాయి సందర్శన లేకుండా బాధ్యతా రాహిత్యంగా విధులు నిర్వహిస్తున్న అధికారుల తీరు మార్చుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కందుల రేఖ అధ్యక్షతన సోమవారం జరిగింది.
“మూడు శాఖలపై మండిపాటు”
సభ్య సమావేశంలో వ్యవసాయ, నీటిపారుదల, వైద్య శాఖల పనితీరుపై ఎమ్మెల్యే శ్రీహరి మండిపడ్డారు. మొదటి వ్యవసాయ శాఖపై చర్చ ప్రారంభించారు. అధికారి చదువుతున్న నివేదిక పత్రాలు సభ్యులకి ఇచ్చిన ప్రగతి నివేదికలో లేకపోవడంతో మీరు చదివే వివరాలు ఎక్కడ చూడాలి? మండలంలో సాగు విస్తీర్ణం ఎంత? ఏ పంటల సాగు ఎంత? మొదలైన వివరాలు సభ్యులకు ఇవ్వకుండా మీరు ఏం చదువుతున్నారు అని ఎమ్మెల్యే ఏ.ఓను నిలదీశారు. గంట వ్యవధిలో పూర్తి వివరాలతో రావాలని వేదికపై నుంచి పంపివేశారు. నీటిపారుదల శాఖ నివేదిక చదివేందుకు ఏఈ రావడంతో మీ డిఈ, ఈఈ లు ఎక్కడ అని ప్రశ్నించారు. వారు తనిఖీలు ఉన్నారని ఈ సమాధానం చెప్పడంతో ఫోన్ చేసి పిలిపించండి అని ఆదేశించారు. అనంతరం వచ్చిన డిఈ, ఈఈ లను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల రోజుల కింద రివ్యూ నిర్వహించి రిజర్వాయర్ కింద కాలువల ద్వారా సాగునీరు అందించాలని ఆదేశించిన నేటికీ అది కార్యరూపం దాల్చలేదు ఎందుకని ప్రశ్నించారు.
కాలువల్లో చెట్లు మొలిసి, కట్టలు తెగి, రిజర్వాయర్ కట్టపై పిచ్చి మొక్కలు పెరిగిన ఎందుకు పట్టించుకోరని ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. మీరు ఏం చేస్తారు? ఎలా చేస్తారో? వారంలోగా పనులు ప్రారంభించి పంటలు సాగు చేసుకున్న రైతులకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. వైద్యశాఖ పనితీరు ఆసుపత్రి సూపర్నెంట్ వివరిస్తుండగా పీహెచ్ సిర్ లో కేవలం 9 ప్రసవాలు జరగడం ఏంటని వరంగల్, జనగామ ఆసుపత్రిలో వందల సంఖ్యలో ఎలా జరుగుతున్నాయని అధికారుల్ని నిలదీశారు. ఆసుపత్రిలో సౌకర్యాలు లేకుంటే తనకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న మీకు కనీసం బాధ్యతలు గుర్తు రావట్లేదని ప్రశ్నించారు. నా నియోజకవర్గంలో పనిచేసే మీ నుంచి లంచాలు అడగనని బాధ్యతగా పనులు చేయకుంటే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా పనిచేసి ప్రజలకు సేవలు అందిస్తూ మండలాన్ని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో తాసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీధర స్వామి వివిధ శాఖల అధికారులు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.