అవినాష్‌ కేసులో  కొనసాగుతూనే ఉన్న వాదనలు

అవినాష్‌ కేసులో  కొనసాగుతూనే ఉన్న వాదనలు

అవినాష్‌ కేసులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజే మొత్తం వాదనలను పూర్తి చేస్తానని జడ్జి చెప్పడంతో న్యాయవాదులు పోటా పోటీగా తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు. రంగన్న స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా నలుగురు నిందితుల పేర్లు చెప్పినా ఆ వివరాలు ఎక్కడా లేవని అవినాష్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక దస్తగిరిని ఒక్క సారి కూడా విచారణకు పిలువలేదని.. అరెస్ట్‌ చేయలేదని వాదించారు. దస్తగిరి అవినాస్‌ గురించి ఎక్కడా చెప్పలేదని తెలిపారు. అలాగే కస్టడీ విచారణ అవసరమని సీబీఐ చెబుతోందని, అలా అయితే అవినాష్‌ రెడ్డి ఏడు సార్లు విచారణకు హాజరయ్యారు, అప్పుడు ఎందుకు అరెస్ట్‌ చేయలేదని  ప్రశ్నించారు. ఇక అవినాష్‌ తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పుడు సీబీఐ హడావుడి చేస్తోందని ఆయన తనరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.

సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంవత్సరం తరువాత జనవరి 23 న అవినాష్‌కు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. అవినాష్‌పై లేని పోని అబాండాలు మోపుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ నెల 19న సీబీఐ ముందుకు రావాల్సి ఉండగా.. తల్లి ఆరోగ్యం సీరియస్‌గా ఉండడంతో మార్గమధ్యలో నుంచి వెనక్కు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి కర్నూలు ఆస్పత్రిలోనే ఉన్నారని తెలిపారు. అందుకే 27 వరకు హాజరు కావడానికి సమయం అడిగామన్నారు. ఇక ఆధారాలు మాయం చేస్తారని వస్తున్న ఆరోపణలను కూడా ఖండించారు.  అటు.. అవినాష్‌రెడ్డి న్యాయవాది వాదనలు వినిపిస్తుండగానే.. సునీతా రెడ్డి లాయర్‌ జోక్యం చేసుకున్నారు. అసహనానికి గురైన జడ్జి మందలించారు. తాను కేసు పూర్తి వివరాలు పూర్తిగా తెలుసుకుంటున్నానని చెప్పారు. ఇక రేపు కూడా వాదనలు కొనసాగించాలని సునీతారెడ్డి న్యాయవాది తెలిపారు. అందరూ సహకరిస్తే సెలవుల తర్వాత వింటామని జడ్జి స్పష్టం చేశారు.