యవ్వనం ఇక మీ చేతుల్లోనే.. వయసును వెనక్కి మళ్లించే సప్లిమెంట్స్ అమ్మకానికి.. నెలకు రూ. 28 వేలే!

యవ్వనం ఇక మీ చేతుల్లోనే.. వయసును వెనక్కి మళ్లించే సప్లిమెంట్స్ అమ్మకానికి.. నెలకు రూ. 28 వేలే!
  • ప్రకటించిన అమెరికా మిలియనీర్ వ్యాపారవేత్త బ్రయాన్ జాన్సన్
  • రూ. 16 కోట్లు ఖర్చు చేసి 1000కిపైగా పరిశోధనల అనంతరం ‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్’ రూపకల్పన
  • తన వయసును 5 ఏళ్లు వెనక్కి మళ్లించానన్న జాన్సన్
  • నెలకు ఫాస్ట్‌ఫుడ్‌కు చేసే ఖర్చు కంటే చవగ్గానే సప్లిమెంట్ అమ్ముతానని ప్రకటన

  మీరు చదివింది నిజమే! నిత్య యవ్వనంగా కనిపించే సీక్రెట్ ఒకటి అమ్మకానికి ఉంది. అది కూడా అత్యంత చవగ్గా. కేవలం రూ. 28 వేలకే మీరు దానిని సొంతం చేసుకొని వయసును రివర్స్ చేసుకోవచ్చు. ఇంకా నమ్మలేకపోతున్నారా? అయితే, ఇది చదవండి.  పెరుగుతున్న వయసును వెనక్కి మళ్లించే (రివర్స్ చేసుకునే) సీక్రెట్ సప్లిమెంట్స్ తన వద్ద ఉన్నాయంటున్నాడు అమెరికాకు చెందిన 46 ఏళ్ల మిలియనీర్ వ్యాపారవేత్త బ్రయాన్ జాన్సన్. ఆ సప్లిమెంట్లతో తాను తన వయసును 5.1 సంవత్సరాలు తగ్గించుకున్నట్టు చెప్పాడు. వయసును రివర్స్ చేసే ఈ సప్లిమెంట్లకు ఆయన ‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్’ అని పేరు పెట్టాడు. ఇందులో డైట్‌తోపాటు వందకుపైగా రోజువారీ సప్లిమెంట్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు కోసం ఆయన ఏకంగా 2 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు రూ. 16 కోట్లు ఖర్చు పెట్టాడట.

  ఇప్పుడీ యవ్వన సీక్రెట్‌ను ఫాస్ట్‌ఫుడ్ తినేందుకు అయ్యే ఖర్చుకంటే చవగ్గా అమ్ముతానని ప్రకటించాడు. 30 రోజులకు కేవలం 343 డాలర్లు (దాదాపు రూ. 28,624)కు విక్రయిస్తానని పేర్కొన్నాడు. ఇందులో డ్రింక్ మిక్స్, ప్రొటీన్,  8 ట్యాబ్లెట్లు, స్నేక్ ఆయిల్, 67 పోటెంట్ మందులు, 400 కేలరీలు ఉంటాయి. 1000కిపైగా ప్రయోగాల అనంతరం వీటిని రూపొందించినట్టు తెలిపాడు. 

  సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్ అయిన జాన్సన్ తన బ్లూప్రింట్ స్టాక్‌తో ఆహారం నుంచి 400 కేలరీలను ప్రత్యామ్నాయంగా తీసుకోవడం ద్వారా తన వయసును 5 ఏళ్లు వెనక్కి మళ్లించినట్టు చెప్పుకొచ్చాడు. ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌తో తన వయసును వెనక్కి తిప్పినట్టు ఆయన చెబుతున్నప్పటికీ దీనికి శాస్త్రీయ అధారాలు లేవు. అంతేకాదు, జాన్సన్ చెబుతున్న యాంటీ ఏజింగ్ థెరపీకి ఏడాదికి 2 మిలియన్ డాలర్లు వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి దీనిని భరించడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఆ సొమ్మేం పెద్ద లెక్క కాదనుకుంటే మాత్రం జాన్సన్‌ను సంప్రదించవచ్చు.